అంగరంగ వైభోగంగా ఒకే రోజు రెండు పెద్ద సంరంభాలు జరుగుతుంటే వారిద్దరూ ఏమయ్యారు? వేడుకల్లో కాదు కదా హైదరాబాద్ నగరంలోనే కనిపించకుండా పోయారు. మెట్రో ప్రారంభం, జిఇఎస్ సదస్సుల్లో తెలంగాణ ప్రథమ కుటుంబం ఆడపడుచు ఎంపి కవిత, మేనల్లుడు మంత్రి హరీశ్ రావు అస్సలు అగుపించలేదు. ఉండి రాకుంటే బాగుండదు గనక హరీశ్ ఢిల్లీకి, కవిత నిజామాబాద్‌కు వెళ్లిపోయారు. ప్రధాని మోడీ చాలా తెలివిగా మంత్రి కెటిఆర్‌కు ప్రాధాన్యత నిచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సంతృప్తిపర్చే ప్రయత్నం చేశారు. అయితే అసలు ముఖ్యమంత్రి పట్టనే ప్రధాని భద్రతా సిబ్బంది సరిగా వ్యవహరించలేదు. ఒక దశలో ఆయనప్రధాని వాహనంలో ఎక్కబోతే ఆపేశారు కూడా. మొత్తం పర్యటనలోనూ మోడీ ఆయనపట్ల అంటీ ముట్టనట్టే తిరిగారు. హైదరాబాద్ మేయర్ సరే అసలే స్థానం నోచుకోలేదు.ఇదంతా ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందనే భావన టిఆర్ఎస్ వర్గాల్లో వుంది. ఇవి చాలనట్టుగా ఇవాంకా ట్రంప్ తన ప్రసంగంలో కెసిఆర్ పేరు ప్రస్తావించకుండా గ వర్నర్ నరసింహన్ పేరు చెప్పి వదిలేశారు. అసలు ఈ మొత్తం ప్రక్రియలో కెసిఆర్‌ను పట్టించుకోకుండా వదిలేశారని ఒక సీనియర్ మీడియా వ్యక్తి వ్యాఖ్యానించారు..ఈ విషయమై పాలకపక్షానికి చాలా బాధగా వున్నా పైకి అనలేని స్థితిలో వుండిపోయారు. బహుశా ఇవన్నీ వూహించబట్టే హరీశ్ ఏదో కార్యక్రమం పెట్టుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. కవిత దీక్షా దివస్ పేరిట నియోజకవర్గమైన నిజామాబాద్ చేరారు. సదస్సుకు ఎంపిలకు ఆహ్వానం లేదని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.