గుజరాత్ ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ కా సవాల్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడం, పెద్దనోట్ల రద్దూ జీఎస్టీ వంటి నిర్ణయాల తరువాత దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎక్కువైందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకోపక్క, కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. గుజరాత్ లో భాజపాని ఓడిస్తే, అదే ఊపును లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించవచ్చు అనే వ్యూహంతో ఉంది. దీనికి అనుగుణంగానే రాహుల్ గాంధీ ప్రచారం కూడా సాగుతోంది. తాను హిందూ బ్రాహ్మణ కులానికి చెందివాడిని అంటూ ఇంతకుముందు చెప్పుకున్నారు. అయితే, తాజాగా ఆయన సోమ్ నాథ్ ఆలయంలో తాను హిందువును కాదు అంటూ, నాన్ హిందూ రిజిస్టర్ లో సంతకం పెట్టడం చర్చనీయాంశం అయింది. ఈ విషయాన్ని భాజపా తమకు అనుకూలంగా మార్చుకుని విమర్శలు ఆరంభించేసింది. మరో అడుగు ముందుకేసి, భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి అయితే ‘రాహుల్ గాంధీ ఇటలీకి చెందిన క్యాథలిక్ ’ అన్నారు. నిజానికి, ఇది రాహుల్ గాంధీ మార్చుకున్న స్టాండా..? లేదా, రాహుల్ ను ఈ విధంగా చూపేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నమా..? అంటే, రెండోదే అని చెప్పుకోవాలి.
గుజరాత్ ఎన్నికల్లో మతం అనేది అత్యంత కీలకాంశంగా మారిపోయింది. అక్కడ భాజపాని ఎదుర్కోవాలంటే ‘హార్డ్ కోర్ హిందు’ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం రాహుల్ ఈ మధ్య ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ద్వారక వెళ్లినప్పుడు తాను శివ భక్తుడనని ప్రకటించుకున్నారు. ఇలాంటప్పుడు, రాహుల్ తనకు తానుగా హిందువును కాదు అని ఎందుకు ప్రకటించుకున్నారు..? ఇదే విషయమై ఏఐసీసీ వర్గాలు ఇస్తున్న వివరణ ఏంటంటే… సోమ్ నాథ్ ఆలయంలో పొరపాటున చోటు చేసుకున్న ఓ చిన్న ఘటనను భాజపా నేతలే ఇలా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటున్నారు. ఇంతకీ ఆ పొరపాటు ఏంటంటే… ఇతర మతాలకు చెందినవారు ఎవరైనా సోమ్ నాథ్ ఆలయానికి వస్తే వారికి ప్రత్యేక రిజిస్టర్ ఉంటుందనీ, దాన్లో సంతకం చేయాల్సి ఉంటుందనీ, అయితే.. రాహుల్ వచ్చినప్పుడు పొరపాటున ఆ రిజిస్టర్ ను అక్కడి సిబ్బంది ఓపెన్ చేశారనీ, రాహుల్ గాంధీ దాన్ని చూసుకోకుండా వెంటనే సంతకం చేసేశారని వివరణ ఇచ్చారు.
అక్కడ జరిగింది ఇదీ అని చెబుతున్నా కూడా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాహుల్ గాంధీపై భాజపా విమర్శలు చేస్తున్నారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో గుజరాత్ హిందువుల్లో కాంగ్రెస్ పై విముఖత పెంచేలా భాజపా నేతలే పురిగొల్పుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇదంతా భాజపా నాటకం అంటున్నారు. ఏదేమైనా, రాహుల్ గాంధీ తొందరపడి సంతకం పెట్టిన మాట వాస్తవం. అయితే, ఇప్పుడీ అంశంపై మరోసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే మరింత ఇబ్బంది అవుతుంది. కాబట్టి, మౌనంగా ఉంటారో లేదో చూడాలి.