రేపు ఇస్లామాబాద్ లో జరుగవలసిన భారత్-పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి ప్రధాన సూత్రధారి జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ను అరెస్ట్ చేసినట్లు నిన్న మీడియాలో వార్తలు రావడంతో, భారత్ కోరినట్లుగా ఈ దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందనే నమ్మకం కలిగింది. అతనిని అరెస్ట్ చేసిన కొద్ది సేపటికే జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియోని విడుదల చేసింది. అందులో భారత్ ఒత్తిడికి పాక్ ప్రభుత్వం తలొగ్గి తమ నేతను అరెస్ట్ చేసినందుకు రెండు దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. బహుశః ఆ కారణంగానేనేమో పాక్ ప్రభుత్వం మళ్ళీ మాట మార్చింది.
పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఖాజీ ఖలీలుల్లా మీడియాతో మాట్లాడుతూ “మసూద్ అజహర్ ని అరెస్ట్ చేసినట్లు నా వద్ద ఎటువంటి సమాచారం లేదు. జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన విషయం తప్ప కొత్తగా ఎవరినీ అరెస్ట్ చేసినట్లు నా వద్ద సమాచారం లేదు,” అని చెప్పారు. అంటే మసూద్ అజహర్ ని అరెస్ట్ చేయలేదని పరోక్షంగా చెపుతున్నారని అర్ధమవుతోంది.
మసూద్ అజహర్ ని అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రభుత్వం ద్రువీకరించకపోవడంతో రేపు ఇస్లామాబాద్ లో జరుగవలసిన భారత్-పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని భారత్ నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కొద్ది సేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యి దీనిపై చర్చిస్తున్నారు. బహుశః మరికొద్ది సేపటిలో దీనిపై అధికారికంగా ఒక ప్రకటన వెలువడవచ్చును.