పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ మొదటికి రావడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పెద్ద ఇరకాటంగా మారినట్టే. ప్రత్యేక హౌదాకు మంగళం పాడి ప్యాకేజీ ప్రహసనం నడిపించిన రోజుల్లో పోలవరంకు సహాయం సాధించడం ఘన విజయంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. శాసనసభలో తీర్మానం కూడా చేసింది. ఏడాది గడిచిన తర్వాత చూస్తే వచ్చిన నిధులు 3000 కోట్లలోపే వుండిపోయాయి. పైగా కాంట్రాక్టరు ట్రాన్స్ట్రారుపై వివాదం సాగింది. రేటు పెంచి వారి బదులు తనే చెల్లించేవిధంగా ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చింది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు కేంద్రం స్పిల్వే, కాఫర్ డాంలపై కొత్త ప్రశ్నలు తీసుకొచ్చింది. అనుమతి వచ్చే వరకూ ముందుకు వెళ్లవద్దని ఆంక్షలు పెట్టింది. దీంతో హతాశుడైన ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా కావాలంటే ప్రాజెక్టు కేంద్రానికే ఇచ్చేస్తామని ప్రకటించారు. మరో వైపున బిజెపి ఎంఎల్ఎలతో సమావేశమై పరిస్థితి వివరించి వారి సహాయం పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టీవీ చర్చలలో టిడిపి ప్రతినిధులు కొంతవరకూ విమర్శలు చేస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం మెతగ్గా మిత్రపక్షంగానే రాబట్టుకుంటామని ప్రకటించారు ఇదే సమయంలో ఒకవైపు నుంచి వైసీపీ మరో వైపు నుంచి కెవిపి రామచంద్రరావు వంటివారు వత్తిడి పెంచుతున్నారు.ఈ లోగా వూహించినట్టే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తనవైన అభ్యంతరాలతో కేంద్రానికి లేఖ రాశారు. అది కూడా పరిష్కారం కావలసి వుంటుంది. ఇదంతా కావాలనే చేస్తున్నారా? చెప్పిన సమయానికి పూర్తి కాదు గనక నెపం మరెవరిపైనో నెట్టడానికి చూస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. బిజెపి నేతలు మాత్రం కేంద్రం ప్రశ్నలకు సమాధానాలు రాకుండా సహకరించడం కల్ల అన్నట్టు మాట్లాడుతున్నారు.