హైదరాబాద్ మెట్రో, జిఇఎస్ల సందర్భంగా ప్రధాని మోడీ అమెరికా అద్యక్షుని సలహాదారు ఇవాంకా రాక వల్ల బ్రాండ్ ఇమేజి పెరిగిందని సంతోషంగా వున్నా ప్రొటోకాల్ పై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని టిఆర్ఎస్ ప్రభుత్వ వర్గాలు కోపంగా వున్నాయి. బిజెపి నేతలు కిషన్ రెడ్డి ,కె.లక్ష్మణ్‌ల పేర్లు వుండి తీరాలని కేంద్రం పట్టుపట్టిందట. వాటిని ఎన్నిసార్లు తొలగించినా మళ్లీ చేర్చి పంపించిందట. ప్రధాని వాహనంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌నే ఎక్కనివ్వలేదు. మంత్రి కెటిఆర్‌ను మోడీ పిలిచి పక్కన పెట్టుకున్నట్టు టీవీలలో కనిపించింది గాని దానికి ముందు ఆయనను ఇబ్బంది పెట్టారట. కెటిఆర్‌ను మురిపించి కెసిఆర్‌ను ఉపేక్షించారని పాలక పార్టీ ప్రతినిధులు భావిస్తున్నారు. మేయర్‌ను అసలు అనుమతించలేదు. ఈ కార్యక్రమం మొత్తంలో ప్రధాని కెసిఆర్‌తో ముచ్చటించడం దాదాపు జరగలేదు. ఆయన చిన్నబుచ్చుకోవడం అందరూ గమనించారు. దానికి తోడు ఇవాంకా కెసిఆర్ పేరు ప్రస్తావించలేదు. మరో వైపున ఉమ్మడి రాజధాని గనక తమ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆహ్వానించి వుండాల్సిందని టిడిపి వారు వాదిస్తున్నారు. ఆయన కూడా సదస్సు జరిగిన హైటెక్స్ తను కట్టించిందేననీ, మెట్రో ఆలోచన అంకురార్ఫణ చేసింది తానేనని స్వయంగా వ్యాఖ్యానించారు. తమ హయాంలో ప్రధాన భాగం జరిగితే అసలు ఆహ్వానించలేదని కాంగ్రెస్ ఫిర్యాదు. హరీశ్ రావును కనిపించనివ్వలేదని ఆయన అనుయాయుల ఆవేదన. ఇంగ్లీషు పత్రికులు ఆయన కావాలనే ఢిల్లీ వెళ్లారని, కెటిఆర్‌తో విభేదాలు పెరిగాయని రాశాయి. వీటన్నిటికి రాష్ట్ర ప్రభుత్వ సమాధానం ప్రోటోకోల్ మా చేతుల్లో లేదు అని మాత్రమే. ఇవన్నీ గాక మహిళా సదస్సులో ఆయన సమన్వయ కర్తగా వుండటం టూమచ్ అన్నది మరో వ్యాఖ్యానం.