హైదరాబాద్ పట్ల టిడిపి వైఖరిలో వైరుధ్యాలు మరోసారి బయిటపడటం మీడియా చర్చలలో ప్రస్తావనకు వచ్చింది. ఇటీవలనే నంది అవార్డుల వివాదం సందర్భంలో విమర్శలు చేసేవారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అనీ,ఆధార్ కార్డులు లేవనీ మంత్రి లోకేశ్ అపహాస్యం చేశారు. దానిపై తీవ్ర దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు సరికాదని అందరూ భావించారు. ప్రభుత్వం కూడా తర్వాత సాగదీయలేదు. ఇంతలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిఅయినా ఇటీవల జరిగిన ప్రధాని కార్యక్రమంలో గానీ, ఇవాంకా పర్యటనలో గాని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చోటు కల్పించలేదని టిడిపి వర్గాలు వాదిస్తున్నాయి. మరి ఈ సంగతి గమనంలో వుంటే మొన్న నోరు పారేసుకుంటారా అని విమర్శకులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. హైదరాబాద్‌పై హక్కు వున్నా పెట్టేబేడా సర్దుకుని హఠాత్తుగా వెళ్లిపోవడమే గాక ఇక్కడ వుండేవాళ్లపై అవాకులు మాట్లాడ్డం సమంజసం కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి రాజధానిలో ఎపి ముఖ్యమంత్రికి గౌరవ ప్రదమైన మకాం తప్ప ప్రోటోకోల్ ప్రత్యేకంగా ఏమీ వుండదని కూడాచెబుతున్నారు. గవర్నర్ మాత్రం ఇరురాష్ట్రాలకూ ప్రతినిధి గనక రాజ్‌భవన్‌లో సమాన హౌదా వుంటుంది. అయినా మోడీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రినే చిన్నబుచ్చితే ఇక ఎపి సంగతి ఏం చెబుతామని టిఆర్ఎస్ నేతలు ఎదురు ప్రశ్న వేస్తున్నారు.