ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందా.. అంటే, అవుననే చెప్పాలి. దీనికి సంబంధించిన బిల్లును ఈ నెలలో ప్రారంభం కాబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రాలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా ఈ బిల్లు రూపొందుతుందని చెబుతున్నారు. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. నియోజక వర్గాల సంఖ్య పెంపు కోసం తెలుగు రాష్ట్రాలు చాలా ఆశగా ఎదురుచూస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే, ఫిరాయింపుల పుణ్యమా అని ఆంధ్రా, తెలంగాణల్లోని అధికార పార్టీలు కొత్త నేతలతో కిటకిటలాడుతున్నాయి. చేరినవారందరికీ చోటు కల్పించకపోతే సమస్యలు తప్పవు అనడంలో సందేహం లేదు. అందుకే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేంద్రంతో ఇదే విషయమై చాలాసార్లు సంప్రదింపులు జరిపారు. అయితే, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. రాజకీయంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచడం వల్ల భాజపాకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదనే అంచనాతో ఈ అంశాన్ని తాత్సారం చేసిందని చెప్పుకోవచ్చు.
ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేస్తారని అంటున్నా… ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమా.., లేదంటే, సాధారణ బిల్లుగా ప్రవేశపెట్టినా సరిపోతుందా అనే అంశంపై ఇప్పటికీ కేంద్రం దగ్గర స్పష్టత లేదు. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, విభజన చట్టం ప్రకారం నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందనే చెప్పాలి. అందుకే, ఈ సమావేశాల్లో బిల్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ బిల్లు విషయమై కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీల వైఖరి ఏంటనేది కూడా ఇక్కడ కీలకమే అవుతుంది. ఎందుకంటే, లోక్ సభలో ఓకేగానీ… రాజ్యసభలో కూడా పరిస్థితిని అంచనా వేయాలి కదా! ఈ ఆరు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం వల్ల భాజపాకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తే… కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కదా! మొత్తం ప్రాసెస్ లో ఎక్కడో ఒక చోట మోకాలు అడ్డే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంది.
ఆంధ్రా తెలంగాణల్లో నియోజక వర్గాల సంఖ్య పెంపు అంశాన్ని భాజపా మొదట్నుంచీ రాజకీయంగానే చూస్తోందని చెప్పొచ్చు. తెరాస, టీడీపీల్లోకి ఫిరాయింపుల ద్వారా ఎక్కుమంది చేరారు కాబట్టి… ఎన్నికల సమయం వచ్చేసరికి అందరికీ అవకాశాలు ఆయా పార్టీలవారు ఇవ్వలేరు కాబట్టి, ఆ సమయంలో భాజపాలోకి వలసలు ఉంటాయని వారు ఆశించారని అనుకోవచ్చు. అయితే, ఇటీవల భాజపా ఓ సర్వే చేయించుకుందనీ.. దాని ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే మరింత బలపడుతున్నట్టు తేలిందట. కాబట్టి, సొంతంగా భాజపాకి కొత్తగా వచ్చే ఊపు ఏదీ ఉండదనేది అర్థమౌతూనే ఉంది. ఈ నేపథ్యంలో పొత్తుల ద్వారానే కొన్ని సీట్లు దక్కించుకోవాలే తప్ప… సొంతంగా పోటీకి దిగినా ప్రయోజనం ఉండదనేది భాజపాకు దాదాపు స్పష్టమైనట్టుగానే కనిపిస్తోంది.