అది మా ప్రాజెక్టే అంటారు. 2019 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్రం ఉందని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కేంద్రం కట్టుబడి ఉంది కాబట్టే, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేశారంటారు. కావాల్సిన నిధులు కేంద్రం ఇస్తోందంటారు. అంతవరకూ ఏపీ భాజపా నేతల అభిప్రాయాలు బాగానే ఉంటాయి. కానీ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అవుతుంటే… దానికి తెలుగుదేశం సర్కారు తీరే అంటూ ఏపీ భాజపా నేతలు విమర్శిస్తుంటారు. రాష్ట్రం నుంచి సరైన నివేదికలు కేంద్రానికి అందకపోవడం వల్లనే పోలవరం ఆలస్యం కావడానికి కారణమని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి చాలాసార్లు విమర్శించారు. పోలవరం విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలు చూస్తూనే ఉన్నాం. తాజాగా, టెండర్లు ఆపేయాలంటూ కేంద్రం రాసిన లేఖతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కావాలంటే వాళ్లనే ప్రాజెక్టు నిర్మించుకోమని అప్పగించేద్దాం అని కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ భాజపా నేతలు పోషించబోతున్న పాత్ర ఏవిధంగా ఉంటుందో చూడాలి. కొన్నాళ్లపాటు రాజకీయాలకు పక్కనబెట్టి, ఆంధ్రుల ప్రయోజనాల కోసం వారు ఏదైనా కృషి చేస్తారోమో చూడాలి. అయితే, ఒక్కసారి ఏపీ భాజపా నేతల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే… అధిష్ఠానం అభీష్టానికి ఎదురెళ్లిన పరిస్థితి ఎన్నడూ లేదు!
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాను అన్ని విధాలుగా ఆదుకుంటామని భాజపా పెద్దలు నమ్మబలికారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది వారే, ఆ తరువాత రకరకాల కారణాలు చూపించి దాన్ని ప్యాకేజీగా మార్చిందీ వారే. ఈ విషయంలో ఏపీ భాజపా నేతల కృషి ఏమైనా ఉందా అంటే.. ఏమీ లేదు! రైల్వే జోన్ విషయమైనా సరే ఏపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి చేసే ప్రయత్నాలు ఏవైనా చేశారా అంటే… అలాంటి సందర్భాలూ గతంలో లేవు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. ఈ రెండూ కేంద్రం ఇచ్చిన హామీలే. ఇక, మిగిలింది పోలవరం ప్రాజెక్టు. అంతా కేంద్రమే చేస్తోందనీ, కానీ ఆ క్రెడిట్ తమకు దక్కకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారనేది భాజపా నేతల స్టాండర్డ్ వాదన. సరే, ఆ క్రెడిట్ ను రాష్ట్ర భాజపా నేతలు దక్కించుకునే ప్రయత్నం ఒక్కసారైనా చేశారా అంటే అదీ లేదు. పోలవరం కోసం రాష్ట్రం దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆ బిల్లుల్లో ఓ వెయ్యి కోట్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. మిగతావాటి కోసం కేంద్రం చుట్టూ రాష్ట్ర సర్కారు చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ విషయంలోనైనా రాష్ట్ర భాజపా నేతలు కల్పించుకుని, నిధులు విడుదల చేయాలంటూ కేంద్రాన్ని ఒత్తిడి చేశారా.. అంటే, అదీ లేదు. ఇప్పుడీ టెండర్ల విషయమే తీసుకుంటే.. పనులు త్వరగా సాగాలి కాబట్టి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి కొన్ని పనుల్ని వేరే కంపెనీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కనీసం, ఈ తరుణంలోనైనా ఏపీ భాజపా నేతలు ఏవైనా సలహాలు ఇచ్చారా అంటే.. ఏవీ లేవు.
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టడం తప్ప… ప్రాజెక్టు ముందుకు సాగే పనుల విషయమై ఏపీ భాజపా నేతలు ఇంతవరకూ చేసిందేం లేదు. కనీసం ఇప్పుడైనా వారు స్పందిస్తే బాగుంటుంది. కేంద్రం నుంచి లేఖ అందిన నేపథ్యంలో ఏపీ భాజపా ప్రముఖులతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భాజపా మంత్రి కామినేని, విష్ణుకుమార్ రాజు ఇతర ప్రముఖ నేతలంతా ఉన్నారు. త్వరలోనే తాము ప్రధానమంత్రిని కలుస్తామని, పోలవరం పరిస్థితిని వివరిస్తామని ముఖ్యమంత్రికి వారు చెప్పారు. ఇన్నాళ్లూ విమర్శలకు మాత్రమే పరిమితమైన ఏపీ భాజపా నేతలు.. కనీసం ఇప్పుడైనా పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారో, లేదా ఎప్పటిలానే ప్రేక్షక పాత్ర పోషిస్తారో వేచి చూడాలి.