వెంకటేష్ కెరీర్ చాలా నిదానంగా సాగుతోందిప్పుడు. సినిమాల ఎంపికలో అస్సలు హడావుడి పడడం లేదు. నచ్చిన కథ వచ్చేంత వరకూ ఎదురుచూసి, తాయితీగా సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. గురు తరవాత సుదీర్ఘ విరామం తీసుకున్న వెంకీ ఇప్పుడు తేజ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘ఆటా నాదే.. వేటా నాదే’ అనే పేరు ఖరారు చేశారు. డిసెంబరు 4 నుంచి చిత్రీకరణ మొదలవ్వబోతోంది. కుటుంబ కథా చిత్రాలకు వెంకటేష్ కేరాఫ్ అడ్రస్స్. ఇదీ అలాంటి కథే. కాకపోతే.. కమర్షియల్ అంశాలు, థ్రిల్లింగ్ సంగతులూ చాలా ఉంటాయట. ‘దృశ్యం’ లాంటి విభిన్న స్క్రీన్ ప్లేతో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుంది. తేజకు బాగా అచ్చొచ్చిన కాజల్ ఓ కథానాయికగా కనిపించబోతోందని ప్రచారం. మరో ఇద్దరు కథానాయికల్ని వెదికి పట్టుకోవాల్సివుంది. ఈ సినిమాలో వెంకీ గెడ్డంతో.. రఫ్ లుక్తో కనిపించబోతున్నారట. ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఫామ్లోకి వచ్చేశారు తేజ. అందుకే వెంకటేష్ కూడా.. తేజతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. మరి ఈ కాంబినేషన్ ఏమాత్రం రక్తి కడుతుందో చూడాలి.