తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకై కాంగ్రెస్ రాస్ట్ర నాయకులు అధిష్టానంతో సంబంధం లేకుండా తాముగా చొరవ చూపిస్తున్నట్టు మీడియాలో వచ్చే కథలు విచిత్రంగా వున్నాయి. ఇంత బాహాటంగా వార్తలు వచ్చినా అధిష్టానానికి తెలియదా? పైగా కొత్త శక్తులను కూడగడితే అధిష్టానం వద్దని వారిస్తుందా? గుజరాత్లో హార్దిక్ పటేల్‌ను కలుపుకొనిరావడానికి స్వయంగా రాహుల్ గాంధీ ఎన్ని తంటాలు పడలేదు?తెలంగాణలోనూ కోదండరాం గద్దర్ తదితరులనూ సిపిఐని చేరువ చేసుకోవాలని కాంగ్రెస్ గట్టిగా పనిచేస్తున్నది.సిపిఎం చొరవతో ఏర్పడిన టిమాస్ తనతో కలవడానికి అంతగా సుముఖంగా లేకపోవడం కాంగ్రెస్‌కు నిరుత్సాహంగా వుంది. అంతేగాక దానివల్ల తన ఓటింగు తగ్గిపోతుందనే ఆందోళన కూడా వుంది. ఈ పరిస్థితులలో తమచుట్టూ ఒక కూటమి ఏర్పడుతుందనే భావం కలిగించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నది. తాజాగా వేర్వేరు నాయకులను కలవడం మీడియాకు చెప్పడం కూడా అందులో భాగమే. అధిష్టానం వీటిని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తుంది. అయితే ఇవి విఫలమైతే రాహుల్‌కు అప్రతిష్ట గనక వారికి తెలియకుండా తామే చేస్తున్నట్టు చెప్పుకోవడం జరుగుతున్నది. వాస్తవానికి ఇలాటి ప్రయత్నాల గురించి కాంగ్రెస్నాయకులు నాలాటి వారికి చెబుతూనే వున్నారు.