గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై బిజెపి అద్యక్షుడు అమిత్‌షా అతి విశ్వాసంతో వున్నారు. 180 స్థానాలున్న ఆ రాష్ట్ర శాసనసభలో తమ పార్టీకి 150 పైన రావడం అసాధ్యం గానీ అత్యాశ కాదని అంటున్నారు. వాస్తవానికి 165 వస్తాయని ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ప్రధాని మోడీ హయాంలో అక్కడ జరిగిన అభివృద్ధి వల్లనే ఇంత మద్దతు పెరిగిందని ఆయన చెబుతున్నారు. కోటిమందికిపైగా పార్టీ సభ్యులుంటే ఏడు లక్షల మందికి పైగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అందులోనూ ఓటర్ల జాబితాలపై పనిచేసే పన్నాప్రముఖ్ల ప్రాధాన్యత చాలా ఎక్కువంటున్నారు. గుజరాత్లో తమ విజయం ప్రభావం కర్ణాటకపైన తర్వాత రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలపైన తప్పక పడుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు హార్దిక్ పటేల్ వంటివారి మద్దతు వల్ల పెద్ద ప్రయోజనం లేదనీ గుజరాత్ మళ్లీ కుల రాజకీయాల కాలానికి తిరిగివెళ్లడం జరగదని అమిత్ షా చెబుతున్నారు. చాలా రోజులుగా ఆయన గుజరాత్‌లోనే మకాం వేశారు. ఈ వారం ప్రధాని ఇరవై ఎన్నికల సభల్లో మాట్లాడతారట. ఇక అరుణ్‌జైట్లీ, సృతి ఇరానీ వంటి కేంద్ర మంత్రులు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. బిజెపికి దగ్గరగా వుండే సీనియర్ పాత్రికేయుడు స్వపన్‌దాస్‌గుప్తా ఎన్నికల గురించి రాస్తూ గుజరాత్లో ఆ పార్టీ బలం తగ్గుతుందని మీడియాలో వస్తున్నది క్షేత్ర స్థాయి అనుభవంలేని పైపై పరిశీలకులేనని తోసిపుచ్చారు. కాని కొంతమంది ఇతర వ్యాఖ్యాతలు మాత్రం బిజెపి విజయం నల్లేరు మీద బండి కాబోదని జోస్యం చెబుతున్నారు. నిజంగా ఏం జరుగుతుందో చూడాల్సిందే.