చేతిలో గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ ఉన్నా – తొలి అడుగులు తడబడుతూనే వేశాడు అల్లుశిరీష్. ‘శ్రీరస్తు శుభమస్తు’తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సినిమా హిట్ తరవాత… కొంతగ్యాప్ తీసుకొని, ‘ఒక్క క్షణం’ తీశాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీజర్ చూస్తుంటే ‘కాన్సెప్ట్’లో డెప్త్ కనిపిపిస్తోంది. అదృష్టం – విధి మధ్య సాగే ఆట ఈ సినిమా అని టీజర్లోనే చెప్పే ప్రయత్నం చేసింది చిత్రబృందం. టీజర్‌ని కట్ చేసిన విధానం ఆకట్టుకొంది. థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ అనే ఫీల్ తీసకొచ్చింది. ఆర్. ఆర్ స్పెషలిస్టు మణిశర్మ అండ… ఈసినిమాకి కలిసొచ్చే విషయం. వీఐ ఆనంద్ కాన్సెప్ట్ బేస్డ్ కథలు రాసుకుంటుంటాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అలాంటిదే. ఆసినిమా హిట్టుతో అల్లు అరవింద్ దృష్టిలో పడిన ఆనంద్.. శిరీష్‌తో సినిమా కోసం కూడా బలమైన కాన్సెప్ట్‌తో వచ్చినట్టు తెలుస్తోంది. శిరీష్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ కథ తప్పు చేయదన్న భావం అతని మాటల్లో తెలుస్తూనే ఉంది. హీరోయిజం, మాస్ పాటలు అనే కమర్షియల్ సూత్రాల్ని నమ్ముకోకుండా చేసిన సినిమా ఇది. కాన్సెప్ట్ కథలకు పట్టం కడుతున్న ఈ తరుణంలో ‘ఒక్క క్షణం’ ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటుందో చూడాలి.