కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి ఉండవల్లి ఒక కొత్త విషయం చెప్పారు. టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ పార్టీ గురించి వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఉండవల్లి ఈ విషయం చెప్పారు. ఇది ఎంతవరకూ నిజం అనేదానిపై సందేహాలు ఉన్నప్పటికీ చెప్పేటపుడు ఆయన ధీమా చూస్తే అప్పట్లో జరిగిన ఈ రాజకీయ పరిణామం ఆయనకి తెలిసే ఉంటుందని భావించవచ్చు.
ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి సంబంధాలు అంతంత మాత్రమే ఉండటం తెలిసిందే. అందులోను పోలవరం గొడవ విషయంలో మాటల తూటాలు పేలాయి. దీనికి తోడు ఈ మధ్యకాలంలో జగన్ ఎప్పుడూ కూడా బిజెపి పార్టీ ని పల్లెత్తుమాట అనకపోవడం తెలిసిందే. అందువల్ల బిజెపితో జగన్ జత కట్టడానికి సిద్ధమవుతున్నాడని రూమర్లు మొదలవుతున్నాయి. వీటిపై స్పందించిన ఉండవల్లి, బిజెపితో జగన్ పొత్తు పెట్టుకుంటే అది ఆయనకు ఆత్మహత్యా సదృశ్యమే అని అన్నారు . ఎందుకంటే జగన్ ఓటు బ్యాంకు అంతా బిజెపి వ్యతిరేకులే అని, బిజెపితో జగన్ జత కలిస్తే వీరంతా జగన్ కి దూరమవుతారని ఉండవల్లి అన్నారు. అయితే ఈ మాటల మధ్యలో ఉండవల్లి ఒక విషయం బయట పెట్టారు.
అదేంటంటే 2014 ఎన్నికలకు ముందే బిజెపి జగన్ ని సంప్రదించిందని పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించిందని, అయితే అలా జరిగితే మొదటికే మోసం వస్తుందని భావించి జగన్ దాన్ని తిరస్కరించాలని భావించాడని ఆయన బయటపెట్టారు. జగన్ అంగీకరించకపోవడంతో నే బిజెపి పార్టీ చంద్రబాబును సంప్రదించిందని టిడిపితో పొత్తు పెట్టుకుందని ఆయన వివరించారు మరి ఇది ఎంతవరకు నిజమో ఆ రెండు పార్టీలకు మాత్రమే ఎరుక.