ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ వీడటాన్ని తమకు అనుకూలంగా వైకాపా మార్చుకో లేకపోతోందనడంలో సందేహం లేదు. నిజానికి, అసెంబ్లీ సమావేశాలను వైకాపా బహిష్కరించిందే ఫిరాయింపులపై పోరాటం చేయడం కోసమే కదా. ఇలాంటి తరుణంలో ఈశ్వరి టీడీపీలో చేరడాన్ని వైకాపా చాలా సీరియస్ గా తీసుకోవాలి. టీడీపీ ఫిరాయింపు రాజకీయాల్ని మరింత తీవ్రంగా ఖండించాలి. కానీ, వైకాపాలో అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. ‘ఆమె వెళ్లిపోయారు, ఇది టీడీపీ కుట్ర, రాజకీయం, కుదుర్చుకున్న బేరం.. అనాల్సివన్నీ అనేశాం. ఇక్కడితో మా పని అయిపోయిందీ’ అన్నట్టుగా వైకాపా నేతలు భావిస్తున్నట్టున్నారు. ఈశ్వరిని టీడీపీలో చేర్చుకున్న క్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారనీ, ఈ ఫిరాయింపు రాజకీయాలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారనే ధీమాతో వైకాపా ఉందని చెప్పాలి. కానీ, తాజా ఫిరాయింపును నిశితంగా గమనిస్తే… టీడీపీ ఎరవేసింది కాబట్టే ఆమె వెళ్లారు అనే దానికంటే, జగన్ తీరు బాగులేకనే ఈశ్వరి బయటకి వచ్చేశారనే అభిప్రాయమే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తోంది.
గిడ్డి ఈశ్వరి తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ వ్యవహార శైలి గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అరుకు నియోజక వర్గం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను జగన్ కు వివరించడానికి తాను వెళ్తే.. ఆయన స్పందన చూసి ఆశ్చర్యపోయానని ఈశ్వరి అన్నారు. కుంబా రవిని పార్టీలో చేర్చుకోవద్దనీ, దాని వల్ల పార్టీలో గ్రూపులు పెరుగుతాయని తాను చెప్పినా జగన్ వినలేదనీ, ‘నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు కల్పించుకుంటావు. రవి అరుకు ఎమ్మెల్యే అయితే నీకేంటి నష్టం’ అని కటువుగా జగన్ మాట్లాడారన్నారు. సోది మాటలు చెప్పొద్దనీ, లేనిపోని పంచాయితీలు మానుకుని తన పనేదో తనని చూసుకోవాలని జగన్ అనేశారన్నారు. జగన్ స్పందన చూసి బాధేసిందనీ, కానీ.. తాను తొందర పడలేదనీ, ఆ తరువాత మరో నెలరోజుపాటు పార్టీలో అందర్నీ బతిమాలి మరీ తన గోడు వినిపించే ప్రయత్నం చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఈశ్వరి అన్నారు. పార్టీలో కీలక నిర్ణయాలపై జగన్ తమ సలహాలు కోరతారుగానీ, ఎవరు చెప్పిందీ ఆయన వినరని ఈశ్వరి చెప్పారు.
జగన్ తీరు నచ్చకే పార్టీ నుంచి బయటకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గిడ్డి ఈశ్వరి ప్రధానంగా చెబుతున్నారు. గతంలో ఫిరాయించిన వైకాపా నేతల్లో చాలామంది ఇదే కారణం చెప్పారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వరూ, కీలక నిర్ణయాల సమయంలో అభిప్రాయాలను పట్టించుకోరు, అంతా జగన్ చెప్పినట్టుగానే జరగాలీ అనే అభిప్రాయాలే ప్రతీసారీ బయటకి వస్తున్నాయి. దాని మీదే ఎక్కువ చర్చ వినిపిస్తోంది. పార్టీ నుంచి బయటకి వచ్చినవాళ్లు ఇలా మాట్లాడటం రొటీన్ అనుకున్నా… ఈ తరహా ప్రచారాన్ని వైకాపా ప్రభావవంతంగా తిప్పికొట్టలేకపోతోంది కదా. ఇప్పుడు గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే… జగన్ అలా ప్రవర్తించరూ, అంత కటువుగా మాట్లాడి ఉండరూ అని ఖండించే అవకాశం వైకాపా నుంచి ఉంటుందా..? సో.. దీని వల్ల ఏం జరుగుతున్నది ఏంటంటే.. టీడీపీ ఫిరాయింపు రాజకీయాల్ని మరింత బలంగా వైకాపా ఎండగట్టలేకపోతోంది. జంప్ జిలానీలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం కంటే… జగన్ వ్యవహార శైలి పైనే ఎక్కువ ఫోకస్ వచ్చేస్తోంది. ఈ తరహా ప్రచారాన్ని వైకాపా గమనిస్తోందో లేదో తెలీదుగానీ… ఫిరాయింపులపై బలమైన పోరాటం చేయాలనుకుంటే, తమ బలహీనతల్ని తగ్గించుకోవాలి, లేదా సమర్థంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నమైనా చేయాలి. ఇవాళ్ల గిడ్డి ఈశ్వరి చేసిన విమర్శలే రేప్పొద్దున మరో ఫిరాయింపు ఎమ్మెల్యే చేస్తారు. అప్పుడు కూడా వైకాపా మౌనంగా ఉంటే.. జగన్ పై వారు చేస్తున్న విమర్శల్ని అంగీకరించినట్టే అవుతుంది కదా!