హైదరాబాద్: రజనీకాంత్‌ను పక్కన పెడితే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నంబర్ 1 ఎవరంటే వినబడుతున్న ఒకే ఒక పేరు అజిత్. గత ఏడాది ‘యెన్నై అరిందాల్’, ‘వేదాళం’ చిత్రాలతో రెండు హిట్స్ కొట్టాడు(ఈ రెండు చిత్రాలను నిర్మించిందీ తెలుగు నిర్మాత ఏఎమ్ రత్నం కావటం విశేషం). మరోవైపు అతని సమకాలీనులు విజయ్, సూర్య గత ఏడాది విజయాన్ని చవి చూడకపోవటంతో అజిత్ ఆధిపత్యానికి ఎదురు లేకుండా పోయింది. మామూలుగానే కోలీవుడ్‌లో ఓపెనింగ్స్‌లో అజిత్‌ను కింగ్ అంటారు. దానికి తోడు రెండు మంచి విజయాలు సాధించటంతో అజిత్ పైచేయి స్పష్టంగా కనబడుతోంది.
అజిత్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హీరో అంటే ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండటం మొదటి ప్రత్యేకత. సహజంగానే అందగాడు, మంచి రంగుతోపాటు మేచోగా ఉంటాడు. ప్రొఫెషనల్ బైక్ రేసర్… చిన్నప్పుడు బైక్ మెకానిక్‌గా పనిచేశాడు. కోలీవుడ్‌లో అగ్రనటుడైనా కూడా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తాడు. తన చిత్రాలకు సంబంధించిన ప్రమోషనల్ ప్రోగ్రామ్స్లోనే కాకుండా, ఏ అవార్డ్ కార్యక్రమాలకు, పబ్లిక్ ఫంక్షన్లకు కూడా హాజరవడు. పబ్లిసిటీ లేకుండా ఛారిటీ చేస్తాడు. మరో హైలైట్ ఏమింటే, మామూలుగా మన హీరోలు కొంతమంది నిద్ర పోయేటప్పుడు కూడా విగ్గు గానీ, హెయిర్ ఎక్స్టెన్షన్గానీ పెట్టుకునే ఉంటారు. అజిత్ తన జుట్టు తెల్లబడిపోయినాకూడా, తను పోషించే పాత్ర రీత్యా అవసరమైతే తప్ప నల్లరంగు వేసుకోడు. వివాదాలుగానీ, ఎఫైర్లుగానీ లేవు. ఒకే ఒక్కరితోనే ఎఫైర్ పెట్టుకుని ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఆమె సినీ నటి షాలిని.అజిత్ తండ్రి కేరళ బ్రాహ్మిణ్ కాగా తల్లి కొల్కతాలో స్థిరపడిన సింధీ.