హేమా హేమీల నడుమ కొత్త ముఖాలు ఉదయించాయి. పురుఛ్చతలైవి జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్ ఉపఎన్నిక ఈ సారి మరింత ఆసక్తికరంగా మారనుంది. గతంలో ఎన్నడూ విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన నియోజకవర్గమనే కారణంతో వార్తల్లో నిలిచి, ఎన్నిక రద్దయిన ఆర్కేనగర్ బరిలో ఈసారి తమిళ హీరో విశాల్ రంగంలోకి దిగారు. ఓవైపు రజనీకాంత్, కమల్‌హాసన్‌లు ఇదిగో అదిగో అంటుంటే… విశాల్ మాత్రం నేరుగా ఎన్నికల రణరంగంలోకి దిగిపోయాడు. మరోవైపు జయలలిత వారసురాలినంటూ అమ్మ మరణం తర్వాత రాజకీయ తెరపైకి వచ్చిన దీప సైతం అభ్యర్ధిగా రంగంలోకి వచ్చారు. వీరిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
గత కొంతకాలంగా తమిళ చిత్ర పరిశ్రమ హక్కుల కోసం పోరాడుతున్న విశాల్ తాజాగా మెర్సల్ సినిమా వివాదం లో ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించాడని పన్ను అధికారుల దాడులకు గురయ్యాడని వార్తలు కూడా వచ్చాయి. అప్పుడే తొలిసారిగా ఈ హీరో రాజకీయ ఆకాంక్షలు వెల్లడయ్యాయి. ఏదేమైనా… హీరోగా దాదాపు 15ఏళ్ల వయసున్న విశాల్ ప్రత్యక్ష రాజకీయాలలో తన సత్తా పరీక్షించుకొనున్నాడు. ఎంతో కాలం తర్వాత, హీరో విజయ్ కాంత్ తర్వాత తమిళ రాజకీయాల్లో కి ప్రవేశిస్తున్న పాపులర్ హీరో విశాల్ అని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో ఈ హీరో అందుకునే ఫలితం రానున్న ఎన్నికల్లో సినీతారలకు దిక్సూచి గా ఉపయోగపడే అవకాశాలున్నాయి. పైగా జన్మతహ తెలుగువాడు కావడంతో… విశాల్ కృష్ణ… రాజకీయ ప్రస్థానం తెలుగు వారికి ఆసక్తి కలిగించేదే.