ప్రతిపక్ష నేత జగన్ సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా గుత్తికి చేరుకుంది. ఇక్కడ జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. యథాప్రకారం చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పించారు. మోడల్ స్కూళ్లలో టీచర్లు తనను కలిశారనీ, తమకు సకాలంలో జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. తన దగ్గరకి వస్తున్నవారంతా చంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పాలనలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదనీ, అందరూ మోసపోయారనీ జగన్ విమర్శించారు. ఇలాంటి తరుణంలో మనకు ఎలాంటి నాయకుడు కావాలనేది మనస్సాక్షిని అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోసం చేసేవాడు నాయకుడుగా కావాలా అని ప్రశ్నించారు. మనకు అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా అన్నారు. నాలుగేళ్ల పాలనలో ఆయన చెప్పినవీ చేసినవీ అన్నీ అబద్ధాలే అని జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం అయిపోయిందీ, గ్రామాల్లో పెన్షన్లు తీసుకోవాలన్నీ జన్మభూమి కమిటీల వారికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. జగన్ ప్రసంగంలో ఇతర అంశాలన్నీ షరా మామూలే!
జగన్ ప్రసంగాల్లో ఒక విషయాన్ని మాత్రం గమనించొచ్చు! అదేంటంటే… చంద్రబాబు మాటలు నమ్మొద్దని ప్రజలకు చెబుతున్నారు, ఆయన చెప్పేవి అన్నీ అబద్ధాలే అని అంటున్నారు, మాట మీద నిలబడని ముఖ్యమంత్రి అని దుమ్మెత్తి పోస్తున్నారు! సరే, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధం అయినప్పుడు… ఆయన చెప్పిన ఒక మాటను జగన్ చాలా బలంగా నమ్ముతూ ఉండటం విశేషం! అదేంటంటే… ఎన్నికల గురించి!! గుత్తిలో జగన్ మాట్లాడుతూ… ‘ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మైకు పట్టుకుని తన కార్యకర్తలతో ఓ విషయం చెప్పుకొచ్చారు. మరో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. మీరంతా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు చెప్పారు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చిన మాటల ప్రకారం మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు… మనమంతా మన మనస్సాక్షిని అడగాలి. మనకు ఎలాంటి నాయకుడు కావాలని ప్రశ్నించుకోవాలి’ అని జగన్ చెప్పారు.
గందరగోళానికి గురి చేసే అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలు అయినప్పుడు… ఏడాదిలోగా ఎన్నికలు వస్తాయని ఆయన చెబితే జగన్ ఎలా నమ్ముతున్నారు..? చంద్రబాబు పాలన అబద్ధం, హామీలు అబద్ధం, అమలు అబద్ధం అవుతున్నప్పుడు… ఎన్నికల గురించి చెప్పేది కూడా నిజం అవుతుందన్న భరోసా ఏంటీ..? ఒక్క ఎన్నికల విషయంలోనే చంద్రబాబును జగన్ నమ్ముతున్నట్టా..? ఎన్నికలు వచ్చినప్పుడే రానివ్వండీ… ప్రతీసారీ ‘చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కాబట్టి వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయ’ని తన ప్రసంగంలో చెప్పాల్సిన అవసరం లేదు కదా..! మిగతా విషయాల సంగతేమోగానీ, ‘ఎన్నికల టాపిక్’ వచ్చేసరికి చంద్రబాబు చెప్పిన మాట జగన్ నమ్ముతున్నట్టే అనే చర్చకు ఆస్కారం ఇచ్చేలా లేదూ..!