బహుశా భాజాపా నేతలు కూడా ఈ రేంజ్లో చెప్పుకుని ఉండరు. అంత గొప్పగా చెప్పుకుంటున్నారామె. ఇంతకీ ఆమె ఎవరంటే ప్రస్తుతం అధికారికంగా వైసీపీ ఎం.పి. గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎన్నికల్లో గెలిచిన కొత్త పల్లి గీత… మొదటి నుంచి తన రూటే సపరేట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. స్వల్పకాలంలోనే గెలిచిన పార్టీకి షాకిచ్చి సైకిలెక్కేశానంటూ దాదాపు ప్రకటించేశారు. ఆ తర్వాత కబ్జాలు, కోర్టు గొడవలు ఇలా వివాదాలతో వార్తల్లో నానుతున్నఆమెను చూసి ఏమనుకుందో ఏమో కానీ, సైకిల్ పార్టీ కూడా ఆమెను దూరం పెట్టింది. దీంతో రెంటికీ చెడిన రేవడి అయిన చందంగా తయారైన ఆ ఎంపీ… గత కొద్ది కాలంగా ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ కనపడడం లేదు.
ఆ ఎంపి మాట్లాడుతూ భాజాపా పార్టీ వైపు తాను చూస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి సాక్షాత్తూ ప్రధానిని కూడా వివాదాల్లోకి లాగేలా మాట్లాడారు. తనకు ప్రధాని మోడీ ఆశీర్వాదాలున్నాయంటున్న గీత… ఆయన మాట ప్రకారమే తాను ప్రస్తుతం ఏ పార్టీలో చేరబోవడం లేదని చెప్పారు.
అంతేకాదు…కష్టకాలంలో తనకు ప్రధాని మద్ధతుగా నిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి జనానికి తెలిసినంత వరకూ ఈ ఎంపీకి వచ్చిన కష్టాలేవీ విధి వశాత్తూ వచ్చినవి కాకపోవడం ఇక్కడ గమనార్హం. పైగా మొదటి నుంచీ రకరకాల ఆరోపణల్లో ఆమె పేరు వినపడుతూ వచ్చింది. అలాంటి ఎంపి తనకు కష్టకాలంలో ప్రధాని మద్ధతు ఉందంటూ చెప్పడం ఆశ్చర్యకరం.
ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు అంటున్నారు గీత. వచ్చే 2018లో తన రాజకీయ గమ్యం నిర్ణయించుకుంటానంటున్న గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి మాత్రం ఇక పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. అయితే తాను మరో పార్టీలో చేరే ముందు మాత్రం స్పీకర్‌కు రాజీనామా సమర్పించి మాత్రమే చేరతానంటూ నైతిక విలువలకు కేరాఫ్‌లా చెప్పేశారు.
అవునూ… పార్టీ మారాలనుకున్నప్పుడు వెంటనే రాజీనామా చేయవచ్చుగా? అబ్బా… ఆశ… అలా చేస్తే అప్పుడే మాజీ ఎంపీ అయిపోరూ. తీరుబాటుగా పదవీకాలం పూర్తిగా అనుభవించి… అప్పుడు రాజీనామా చేయడం అదే నవ రాజకీయ నైతి” కత” … ఇంకా నయం….ఈ సలహా కూడా మోడీ ఇచ్చారనలేదు…” ‘