సావిత్రి ఆత్మ కథని ‘మహానటి’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. సమంత, మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్, సల్మాన్ దుల్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రేపు (డిసెంబరు 6) సావిత్రి జయంతి. ఈ సందర్భంగా `మహానటి` నుంచి ఫస్ట్ లుక్కో, టీజరో ఆశించడం ఖాయం. అయితే చిత్రబృందం మాత్రం వేరేలా ఆలోచించింది. ‘మహానటి’ నుంచి ఓ వీడియో రాబోతోంది. ఆ వీడియోలో షూటింగ్ విశేషాల్ని చెబుతారని తెలుస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్ లుక్‌ని ఇప్పుడే బయటపెట్టే ఉద్దేశం లేకపోవడంతో – ఫస్ట్ లుక్ ని డిజైన్ చేయలేదు చిత్రబృందం. కానీ.. సావిత్రి పుట్టిన రోజు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఓ వీడియోని కట్ చేశారు. ఇది టీజరూ కాదు, మేకింగ్ వీడియో కాదు. కానీ సమ్ థింగ్ స్పెషల్‌గా ఉండబోతోందని సమాచారం. అదేమిటో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు కనిపిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. వారిద్దరూ డిసైడ్ అయిపోతే.. ఈ సినిమాకి మరింత హైప్ రావడం ఖాయం.