తెలుగురాష్ట్రాలలో కొన్ని పార్టీలకు కంట్లో నలుసులా, మరికొన్ని పార్టీలకు వరప్రదాయినిలా మారింది ఫిరాయింపు, (అధికారికంగా ఆ పని చేయకపోతే…దానికి మరో పేరు పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడడం). అది అందరికీ తెలిసిందే. దాని మీద రెండు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలది అరణ్యరోదనే అయింది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఛైర్మన్ తీసుకున్ననిర్ణయం మరోసారి దీనిపై జాతీయస్థాయి చర్చను లేవనెత్తింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, వెంటనే వాళ్ల రాజ్యసభ సభ్యత్వాలను రద్దు చేయాలని నితిష్ కుమార్ లేఖ రాసిన దరిమిలా…శరద్ యాదవ్, అన్వర్ అలీల రాజ్యసభ సభ్యత్వాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు రద్దు చేశారు. వివరణ అడగడం వగైరాలేమీ లేకుండానే వారిద్దరిపై వేటు వేసేశారు. దీంతో మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై మన రెంండు రాష్ట్రాల నుంచి ఎంతో మంది మీద ఎప్పటి నుంచో ఉన్న ఫిర్యాదులపై ఎందుకు చర్య తీసుకోవడంలేదు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజాననికి రాజ్యసభ సభ్యత్వం అనేది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వోట్ల ద్వారా లేదా, ప్రభుత్వం నామినేట్ చేయడం ద్వారానో దక్కేది. వీరు పార్టీకి భిన్నంగా వ్యవహరిస్తే అది ప్రజాతీర్పుకు విరుద్ధం అనలేం…పైగా శరద్ యాదవ్, అన్వర్… ఈ ఇద్దరూ కేవలం తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు… అంతే తప్ప వేరే పార్టీలోకి ఫిరాయించలేదు… కాకపోతే ప్రత్యర్ధి పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అని వీరిపై నితిష్‌కుమార్ ఫిర్యాదు. దీనికే స్పందించిన వెంకయ్య వారిపై అనర్హత వేటు వేసేశారు. దీంతో మరి ఇదే రకమైన ఫిర్యాదులు లోక్‌సభలో ఎందరో ఎంపిలపై ఏళ్ల తరబడి ఉంటున్నా ఎందుకు చర్య తీసుకోలేదంటూ సిపిఎం నేత సీతారం ఏచూరి వంటి వారు తప్పుబడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుంటే… మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఏపీలో ఎస్పివై రెడ్డి, కొత్తపల్లి గీత, రేణుక… వీళ్లపై ఆయా ఎంపిల కు సంబంధించిన పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు..? తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో వైసీపీ ఎన్నాళ్లుగానో … వాళ్లపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ చర్యల్లేవు. అంటే తమ ప్రత్యర్ధి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయ్యారు కాబట్టి గుత్తా వంటివారిపై వేటు వేయడం లేదని, ఎపిలో మిత్రధర్మం కోసం చూసి చూడనట్టు ఉంటున్నారని తాజాగా విమర్శలు మొదలవడానికి వెంకయ్య తీసుకున్న నిర్ణయం కారణమైంది.