తెలంగాణ రాష్ట్ర సమితిలో వారసత్వ చర్చ ఎప్పట్నుంచో ఉంది. కేసీఆర్ తరువాత పార్టీలో కీలకం కాబోతున్నది మంత్రి కేటీఆర్ అనే ప్రచారం కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య మెట్రో రైలు ప్రారంభోత్సవం, గ్లోబల్ సమిట్ కార్యక్రమాల్లో కేటీఆర్ ను బాగా ఫోకస్ చేశారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో మరో మంత్రి హరీష్ రావు ఢిల్లీలో ఉండటంపై కూడా రకరకాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఏదైమైనా, వచ్చే ఎన్నికల నాటికి తెరాస రాజకీయాల్లో కేటీఆర్ అత్యంత కీలక పాత్ర పోషించేందుకు కావాల్సిన నేపథ్యం సిద్ధం చేసిపెట్టారనే చెప్పుకోవచ్చు. అయితే, ఇప్పుడు కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత కూడా రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. దాని తగ్గట్టుగానే ఆమె ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే, ఈ మధ్య ఆమె తన పార్లమెంటు నియోజక వర్గంలోని జగిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. నిజానికి, ఈ అసెంబ్లీ నియోజక వర్గంలో తెరాసకు ప్రత్యేకంగా పట్టులేదు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గడచిన ఎన్నికల్లో గెలుపొందారు. ఇక్కడ తెరాస బలం పుంజుకోకపోవడానికి వర్గ పోరే కారణం అని అంటున్నారు. తెరాసలో క్రియాశీలంగా ఉంటూ వస్తున్న ఇద్దరు నేతల మధ్య అస్సలు పొసగడం లేదు. దీంతో జగిత్యాలలో తెరాస పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో పార్టీ బాధ్యతల్ని కవిత తీసుకున్నారు. అలాగని,ఆ ఇద్దరు స్థానిక నేతల మధ్య ఉన్న వర్గపోరును తీర్చే పని ఆమె చేయడం లేదు. జగిత్యాలలోనే ఒక ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే సమీక్షిస్తున్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి పనులు, పార్టీ కమిటీల సమావేశాలూ అన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటారు.
ఇదంతా భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడొచ్చు. ఎందుకంటే, ఎంపీగా గడచిన మూడున్నరేళ్లుగా ఆమెకు కేంద్రంలో ఎలాంటి ప్రాధాన్యతా దక్కలేదు. కేసీఆర్ కూడా ఆమె మంత్రి పదవి కోసం చాలానే ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. కాబట్టి, ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావాలనే నిర్ణయానికి ఆమె వచ్చారనీ, దాన్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. కవిత కూడా రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెడితే, పార్టీలో ఆమె పాత్ర ఏంటనేది కూడా చర్చనీయం అవుతుంది. మరీ కేటీఆర్ కు ఉన్నంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా, పార్టీలో మరో శక్తి కేంద్రంగా ఆమె ఎదిగే అవకాశం ఉంటుందనే చెప్పొచ్చు. మరి, మున్ముందు పరిణామాలు ఎలా మారతాయో వేచి చూడాలి.