గుజరాత్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, అది ప్రధానమంత్రి సొంత రాష్ట్రం కావడం ఒక కారణమైతే, పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధింపు తరువాత గుజరాత్ లో జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడం మరో కారణం. మోడీ సర్కారు తీసుకున్న ఆ రెండు నిర్ణయాలూ గుజరాత్ లోని అత్యధిక సంఖ్యలో ఉన్న వ్యాపార వర్గాలపై బాగానే ప్రభావం చూపించాయి. కాబట్టి, వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఈ ఎన్నికల ద్వారా బయటపడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే, గుజరాత్ ఫలితాల ప్రభావం 2019 లోక్ సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుంది. ఇదే తరహా పట్టుదల కాంగ్రెస్ లో కూడా కనిపిస్తోంది. మోడీ సొంత గడ్డపై భాజపాని ఓడిస్తే, అదే ఊపును దేశవ్యాప్తంగా కొనసాగించడం సులువు అవుతుందనే వ్యూహాలతో కాంగ్రెస్ ఉంది. వ్యూహం అయితే బాగానే ఉందిగానీ, ఆచరణలో రాహుల్ గాంధీ కాస్త తడబడుతున్నారా అనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఏయే అంశాలపై స్పందించాలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తున్నట్టుగా ప్రచార సరళి కనిపిస్తోంది! భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చుకునే సరికే రాహుల్ కు సమయం సరిపోతోంది.
సాధారణంగా, ఏ ఎన్నికల ప్రచారంలోనైనా ఏ పార్టీ అయినా రెండు విషయాలు చెబుతుంది. అధికార పార్టీ అయితే తాము చేసింది చెబుతూనే, చేయబోయేది కూడా ప్రజలకు వివరిస్తుంది. అధికారంలో లేని పార్టీ అయితే హామీలు ఇస్తూనే, అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేస్తుంది. కానీ, ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి అంశాలే కనిపించడం లేదు. రాహుల్ గాంధీపై వ్యతిగత విమర్శలకే భాజపా నేతలు పరిమితమౌతున్నారు. రాహుల్ గాంధీ ఇంకా హోమ్ వర్క్ చేసుకోవాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శిస్తే… రాహుల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచి యువత ఉద్యోగాల కోసం గుజరాత్ కి వస్తోందంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిపై విమర్శించే స్థాయికి ఇంకా రాహుల్ ఎదగలేదంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. మరో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కూడా రాహుల్ మీదే పంచ్ వేశారు. బర్గర్ కీ పిజ్జాకీ ఉల్లిపాయకీ తేడా తెలియని వ్యక్తి మమ్మల్ని గుజరాత్ లో ప్రశ్నిస్తున్నాడనీ, రాహుల్ గాంధీ ముందుగా ఏబీసీడీలు సరిగ్గా నేర్చుకుంటే ఆ తరువాత రాజకీయాలు అర్థమౌతాయని ఎద్దేవా చేశారు. ఇక, మోడీ సంగతి అయితే సరేసరి! రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చారు. ఔరంగజేబు లాంటి రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
ఓవరాల్ ఈ కామెంట్లన్నీ చూసుకుంటే.. రాహుల్ గాంధీపై వ్యూహాత్మకంగా భాజపా నేతలు మాటల దాడి చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే, ఈ క్రమంలో భాజపా చేస్తున్నది ఏంటంటే.. తాము చేసిన అభివృద్ధి గురించి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చర్చకు వచ్చే ఆస్కారం ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలపై కూడా మాట్లాడటం లేదు. పనిలోపనిగా రాహుల్ ని ఆ దిశగా ఎక్కువగా మాట్లాడనివ్వడం లేదు. తనపై వినిపిస్తున్న వ్యక్తిగత కామెంట్లను తిప్పికొట్టడంవైపే రాహుల్ దృష్టిని మళ్లిస్తున్నారు. దాని ప్రకారమే రాహుల్ కూడా మోడీపై విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారమంతా వ్యక్తిగత విమర్శల చుట్టూనే జరుగుతోంది. అసలు విషయాలపై ఎవ్వరూ మాట్లాడటం లేదు. చేసింది చెప్పుకోలేని స్థితిలో భాజపా ఉంది. కాబట్టి, భాజపా నేతలంతా కలిసి ఇలా రాహుల్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు.