జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చారు. ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండించారు. డెడ్జింగ్ కార్పొరేషన్ నష్టాల్లో లేదనీ, ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోలనీ, అలాంటప్పుడు ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తూ జనసేన తరఫున కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఈ ఉద్యోగుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలవారు స్పందించాలని కోరారు.
ఈ సందర్భంగా కొన్ని రాజకీయ అంశాలపై కూడా పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను భాజపా, టీడీపీలకు మద్దతు ఇచ్చాననీ, కానీ ప్రజలు సమస్యల విషయంలో ప్రభుత్వాలను నిలదీయడానికి ఎక్కడా వెనకాడలేదని పవన్ చెప్పారు. ఏదో అద్భుతం జరుగుతుందని దాదాపుగా నాలుగేళ్లుగా ఎదురుచూస్తుంటే ఏమీ జరగలేదన్నారు. విభజన సమస్యలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారు. బాసరలో ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడలేకపోతుందనీ, దీన్ని ప్రశ్నించే నాథుడే లేడన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయనీ, ‘మీ మనిషిగా మీలో ఒకడిగా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తాన’ని పవన్ అన్నారు. తాను ఏపార్టీ పక్షం కాదనీ, తాను భారత ప్రజల పక్షంగానీ, భారతీయ జనతా పార్టీ పక్షం కాదన్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే తత్వం తనది కాదనీ, ఉన్నది ఒకటే ప్రాణమనీ పోతే దాన్ని ప్రజలకోసం పోగొట్టుకుంటానని పవన్ చెప్పారు.
పదవి కోసం పార్టీ కాదనీ, ప్రజల సమస్యల గురించి పోరాటం చేయడానికి పార్టీలున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ‘నేను ముఖ్యమంత్రిని అయితేనే ఫలానా పనులు చేస్తాను, సమస్యలు తీరుస్తున్నాను అనే విధి విధానాలకు స్వస్తి పలకాల’ని పవన్ చెప్పడం గమనార్హం. ఈ సందర్భంలో కొంతమంది అభిమానులు.. సీఎం సీఎం అంటూ నినదిస్తుంటే పవన్ స్పందించారు. అధికారం బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలనీ, అధికారానికి జ్ఞానం కావాలనీ, అధికారానికి అనుభవం కావాలనీ పవన్ చెప్పడం విశేషం! ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి కావాలన్నా అనుభవం చాలా చాలా అవసరం అన్నారు. ‘అందుకే, మీరంతా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటుంటే నాకు లోపల ఏమీ అనిపించద’న్నారు. ‘పదవుల్లేవని బాధ్యతలు వదిలేస్తామా, సమస్యల్ని వదిలేస్తామా, పోరాటాలు చెయ్యమా’ అన్నారు. ‘నువ్వు ముఖ్యమంత్రివి కాదు, మంత్రివి కాదు. అయినాసరే, నీ ప్రాంత ప్రజల మీద నీకు ఎంత ప్రేమ ఉందీ, బాధ్యత ఉందీ అని ఆలోచించి, సమస్యలను అర్థం చేసుకుంటే పదవులతో పనేముంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ముఖ్యమంత్రి పదవి గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తున్నాయి. ఆయన ఎవర్నీ ఉద్దేశించి పనిగట్టుకుని మాట్లాడకపోయినా… ‘త్వరలోనే అధికారంలోకి వచ్చేస్తాం, సమస్యలుంటే ఏడాది ఓపిక పట్టండీ’ అని చెప్పుకుంటున్నవారికి పవన్ వ్యాఖ్యలు తగిలే అవకాశం ఉంటుంది కదా!