పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పరివర్తనం చెందుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ ని పరామర్శించిన తర్వాత కార్యకర్తలతో సమావేశమైన జనసేనాని మొదటిసారిగా నిన్న ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన ద్రోహం కారణంగానే జనసేన స్థాపించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇంతకీ తమ్ముడు సినిమా గుర్తుందా? పవన్ హీరో. అచ్యుత్ పవన్ వాళ్ళ అన్న. అన్న అయిన అచ్యుత్ కి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ లక్ష్యాన్ని ఎప్పటికీ అందుకోలేని పరిస్థితి కి వెళ్తాడు. అప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ తన అన్న లక్ష్యాన్ని తాను నెరవేరుస్తాడు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? చదవండి….
ప్రజారాజ్యం పార్టీ మరియు చిరంజీవి ఓడిపోవడం తనకెంతో మనస్తాపం కలిగించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు . అయితే మనస్తాపం కలగడానికి కారణం అధికారం రాకపోవడం కాదని చిరంజీవి ఒక మార్పు కోసం ప్రయత్నించారని, ఆయన, ఆయన పార్టీ ఓడిపోవడం వల్ల ఆ మార్పు సాధ్యం కాలేదని, దాని వల్లే తనకు మనస్థాపం కలిగిందని పవన్ వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజారాజ్యం ఓడిపోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కళ్లు చెమర్చాయి. అయితే అంతలోనే ఆవేశం తెచ్చుకున్న జనసేనాని ప్రజారాజ్యం పార్టీకి ఎవరెవరు ఎలాంటి ద్రోహం చేశారు అనేది తనకు స్పష్టంగా గుర్తుందని సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ గుణపాఠం చెబుతామని ప్రతిజ్ఞ చేశారు పవన్ కళ్యాణ్ .
అలాగే ఆ సందర్భంగా పరకాల ప్రభాకర్ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ – ఆయన ప్రజారాజ్యం పార్టీలో స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారని అయితే ఆ వ్యాఖ్యలు కూడా ప్రజారాజ్యం పార్టీ వేదిక మీద నుంచే చేశారని గుర్తుచేశారు. పీఆర్పీ పార్టీలో ఎంత స్వేచ్చ ఉండేదనే దానికి నిదర్శనం ఆయన తమ పార్టీ వేదిక నుంచే తమ మీద విమర్శలు చేయడమే నిదర్శనమనీ పవన్ అన్నారు.
అయితే ఇంతకాలంగా విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం వల్ల పార్టీ పెట్టినట్టు ప్రశ్నించడానికి పార్టీ పెట్టి అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నయ్యకు జరిగిన ద్రోహం కారణంగానే పార్టీ ప్రారంభించానని చెప్పడం ఆశ్చర్యం.
పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మొదట్లో అల్లరి చిల్లరగా తిరిగి తమ్ముడు అన్నయ్యకు ద్రోహం జరిగాక తానే యుద్ధ రంగంలోకి దూకుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ విషయమంతా చూస్తుంటే జనాలకు తమ్ముడు సినిమా గుర్తుకు రావడం ఖాయం. అయితే ఇది సినిమా కథకి బాగుంటుందేమో కానీ, స్వచ్చమైన రాజకీయాలు చేయాలనుకున్నపుడు ఇలాంటి విషయాలు పూర్తిగా అప్రస్తుతం. పైగా పీఆర్పీ ఒక ఫెయిల్యూర్ స్టోరీ. దాన్ని ఇప్పుడు ప్రస్తావించడం వల్ల నష్టమే తప్ప కొత్తగా ఒరిగే లాభమేమీ లేదు. కేవలం క్యాడర్ ని ఉత్సాహపరచడానికే ఇలా చెప్పి ఉంటే గనక ఇది ఒక తప్పిదం గానే భవిష్యత్తు లో మిగిలే అవకాశముంది. పీఆర్పీ విలీనం తంతు కి చిరంజీవి మంత్రిపదవి స్వీకారానికి దూరంగా ఉన్న కారణంగానే పవన్ కి ఆ మకిలి అంటలేదని, స్వంత అన్నయ్యని సైతం విభేదించాడనే కారణంగానే పవన్ ఆదర్శాల పట్ల కాస్త మంచి ఒపీనియన్ జనాలకి వచ్చిందని మరిచిపోతే అది మొదటికే మోసం చేస్తుంది. అలాగే ఈ విషయంలో విపక్షాల నుంచి విమర్శ రావడం కూడా ఖాయమనిపిస్తోంది !!!