జనసేనాని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు అనూహ్యంగా పెరగడానికి కారణం పునరావాస ప్యాకేజీ వ్యయం పెరగడం అని తెదేపా నేతలు చెప్తున్నారని, అలాగే నిర్మాణ వ్యయం పెరగడం కూడా అంటున్నారన్నారు. ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. నిధుల వ్యయo పై కేంద్రం సందేహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అనుమానాలు నివృత్రి చేయాలని దీనికోసం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని సూచించారు. మన తప్పు లేనప్పుడు భయం అవసరం లేదన్నారు.
కేంద్రం కడతాం అంటే మేమె కడతాం అని తీసుకోవడం, ఇప్పుడు మళ్లీ ఇచ్చేస్తాం అనడం ఏమిటో తనకు అర్ధం కావడం లేదన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ విషయం లో అవకతవకలుసహజమే అన్నారు. ఈ ప్రాజెక్టును ఇక ముందు తరచు సందర్శిస్తానని అవగాహన పెంచుకుంటానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 2018కి పూర్తి కాదని స్పష్టం చేశారు. ఇక అలాంటి మాటలు చెప్పొద్దని వినీ వినీ విసుగొచ్చిందన్నారు. ఇప్పటిదాకా ఒక శాశ్వత సచివాలయం కట్టుకోలేకపోయాం అని అలాంటిది ప్రాజెక్ట్ పూర్తి చేసేస్తాం అనడం నమ్మశక్యoగా లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు, అనుభవం పై తన నమ్మకాన్ని ఆయన మళ్లీ వెలిబుచ్చారు. ఇంతకు ముందు బాబును నమ్మానని ఇప్పుడు కూడా నమ్ముతున్నా అని స్పష్టం చేశారు. అయితే తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ప్రజల పక్షం అన్నారు.