ఈయేడాది కొంతమందికి బాగా కలిసొచ్చింది. హిట్లు లేక డీలా పడిన వాళ్లలో కొంతమంది ఓ మెరుపు మెరిశారు. చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్‌గా నిలిచిన తేజ.. కొన్నేళ్లుగా హిట్ అనే మాటకు దూరమైపోయాడు. 2017లో తనకు ఓ మరపురాని విజయం దక్కింది. ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఓ హిట్టు కొట్టాడు. అంతే కాదు.. బాలకృష్ణ, వెంకటేష్‌లాంటి అగ్ర హీరోల దృష్టిలో పడ్డాడు. రాజశేఖర్ కూడా అంతే. తన పని అయిపోయిందనుకున్న తరుణంలో గరుడ వేగతో హిట్టు కొట్టాడు. ఆ సినిమా వల్ల నిర్మాతలకు ఎన్ని లాభాలొచ్చాయి అనేది పక్కన పెడితే.. రాజశేఖర్‌తో ఎలాంటి కథలు వర్కవుట్ అవుతాయో తెలిసొచ్చింది. ఇప్పుడు మరో హీరో కూడా తన జాతకం 2017లో మారుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. తనే సుమంత్. ఈమధ్య కాలంలో సుమంత్ సినిమాలు చేసిందే తక్కువ. నరుడా డోనరుడా లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
ఈ తరుణంలో ‘మళ్లీ రావా’ అంటూ పలకరిస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతోంది. టీజర్లు, ట్రైలర్లు చూస్తే.. గోదావరిలా ఫీల్ గుడ్ సినిమా అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో తరవాత… ఫీల్ గుడ్ స్టోరీలకు, సున్నితమైన భావోద్వేగాలున్న కథలకు మంచి గిరాకీ ఏర్పడింది. దీన్ని సుమంత్ ఎంత వరకూ అందిపుచ్చుకుంటారో చూడాలి. కాకపోతే ఈ సినిమా ప్రమోషన్లు మరీ డల్‌గా ఉన్నాయి. ఓ వైపు సప్తగిరి ఎల్ ఎల్ బీ ప్రమోషన్లు జోరుగా సాగుతుంటే, సుమంత్ ప్రొడ్యూసర్లు మాత్రం పబ్లిసిటీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ విషయంలో సుమంత్ కంటే సప్తగిరే ముందున్నాడు. మరి వసూళ్లలో ఏది ముందుంటుందో చూడాలి.