కమెడియన్ హీరో అయితే.. మార్కెట్ అప్పుడప్పుడే ఏర్పడుతుంటే నిర్మాతలు ఆచి తూచి ఖర్చు చేయాల్సిందే. లేదంటే `ఫ్లాపు`లో కాలేయడం ఖాయం. సప్తగిరి లాంటివాడు హీరో అయితే… కోట్లు గుమ్మరిస్తారని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే హీరోగా అతని స్టామినా ఏంటో ఇంకా ఎవ్వరికీ అర్థం కాలేదు. తన కోసం జనాలు థియేటర్‌కి వస్తారా, లేదా? వస్తే ఎంత స్థాయిలో అనేది క్లారిటీ రాలేదు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ విషయంలో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ రెండో రోజుకే తుస్సుమన్నాయి. ఆ సినిమాకి నిర్మాత కిరణ్ చాలానే పోగొట్టుకున్నాడు. అయినా సరే.. సప్తగిరి పై ప్రేమ, ఇష్టంతో మరో సినిమా చేశాడు. అదే సప్తగిరి ఎల్ ఎల్ బీ.
ఈ సినిమా పూర్తిగా ప్యాకేజీ స్టైల్లో తయారైంది. తెర ముందు నిర్మాత కిరణ్ అయినా, వెనుక ఉండి నడిపించింది అచ్చంగా సప్తగిరినే. ‘ఇంతలో సినిమా తీసిస్తా’ అంటూ టోకెన్ ఎమౌంట్ తీసుకున్న సప్తగిరి అందులోనే సినిమా మొత్తం పూర్తి చేసి ఫస్ట్ కాపీ ఇవ్వగలిగాడు. తన పారితోషికం, హీరోయిన్ సెలక్షన్, దర్శకుడ్ని ఎంపిక చేసుకోవడం ఇవన్నీ సప్తగిరి ఆలోచనల ప్రకారంగానే సాగాయి. చెక్కులపై నిర్మాత సంతకం చేసిచ్చాడంతే. ఈ సినిమాకి దాదాపుగా రూ.6 నుంచి 7 కోట్ల వరకూ ఖర్చయ్యింది. శాటిలైట్ కాస్తలో కాస్త వచ్చే అవకాశం ఉంది. తొలి రోజు, తొలి షోకే ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న ఈ సినిమా తన బడ్జెట్‌ని రాబట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. ఈవారం పెద్దగా పోటీ లేకపోవడం… మాస్లో సప్తగిరికి కాస్త పట్టు ఉండడం కలిసొచ్చే విషయాలు. ఇది వరకు తీసిన `సప్తగిరి ఎక్స్‌ప్రెస్` కూడా అచ్చంగా ఇలానే ప్యాకేజీ సిస్టమ్‌తో తయారైంది. సప్తగిరి ఇలానే ప్యాకేజీలతో సినిమాలు తీసుకుంటూ వెళ్తే… ప్యాకేజీ స్టార్‌గా మిగిలిపోవడం ఖాయం.