అవకాశాలు రావో, వచ్చినా ఆచి తూచి స్పందిస్తుంటాడో తెలీదు గానీ… సుమంత్ మాత్రం చాలా నిదానంగా కెరీర్ని ‘సా…..గిస్తుంటాడు’. చాలా విరామం తీసుకుని ‘విక్కీ డోనర్’ చేశాడు. అది పల్టీకొట్టడంతో ఇంకాస్త జాగ్రత్త పడిపోయి ఇప్పుడు ‘మళ్లీ రావా’ తీస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. ఇక మీదట మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడేమో… మూడు సినిమాలకు ఓకే చెప్పేశాడు. అందులో ఒకటి జనవరి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దగ్గర పనిచేసిన అనిల్ గాంధీ దర్శకత్వం వహిస్తారు. ఇదోథ్రిల్లర్ అని తెలుస్తోంది. ‘క్షణం’ సినిమాలా చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో నడుస్తుందట. ”సినిమాల విషయంలో, కథల విషయంలో రాజీ పడేది లేదు. నేనేం డబ్బుల కోసం సినిమాలు చేయడం లేదు. మంచి కథలు వచ్చేంత వరకూ ఎదురుచూడడం నాకు ముందు నుంచీ అలవాటే. ఈసారి మూడు కథ కథల్ని ఒకేసారి ఓకే చేశా. మూడూ వేర్వేరు జోనర్లలో సాగుతాయి. అందులో ఓ థ్రిల్లర్ కూడా ఉంది. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చేయలేదు” అంటున్నాడు సుమంత్. ‘మళ్లీ రావా’ హిట్టయితే.. ఈ మూడు సినిమాలూ పట్టాలెక్కడం ఖాయం. ఫలితంలో తేడా వస్తే.. మాత్రం ఏం చెప్పలేం.