తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
కవిత్వం ఓ అందమైన, అద్భుతమైన సాహిత్య ప్రక్రియ.
ఆస్వాదించే మనసు, విజ్ఞత, అనుభవం ఉంటే తప్పకుండా కవిత్వం మనసుకు నచ్చుతుంది. మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది. కానీ…. అది అందరికీ అర్థం అవుతుందా, అంటే… ‘అవును’ అని సమాధానం చెప్పడం కష్టం. అర్థమైతే అద్భుతంగా అనిపించే కవిత్వం… అర్థం కాకపోతే.. ‘పిచ్చిదనం’గా కనిపిస్తుంది. కొన్ని సినిమాలూ అంతే! ‘పొయెటిక్ ఎక్స్‌ప్రెషన్స్’ కోసం తహతహలాడుతుంటాడు దర్శకుడు. తన దృష్టిలో అది అందమైన అద్భుత కావ్యమే. ఆ తరహా అనుభూతుల్ని ఇష్టపడేవాళ్లకూ అలానే అనిపిస్తుంది. కానీ మిగిలిన వాళ్లకు ‘నిదానం, చాదస్తం, స్లో’ అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్స్ ఇచ్చిన సినిమా….. ‘మళ్లీ రావా’.
కథ
కార్తిక్ (సుమంత్) అల్లరి పిల్లాడు. చదువులో కంటే కోతి వేషాలపైనే ఆసక్తి ఎక్కువ. తొమ్మిదో తరగతిలోనే తన ఊరికి, స్కూలుకీ కొత్తగా వచ్చిన ముంబై అమ్మాయి అంజలి (అకాంక్షసింగ్)ని చూసి ఇష్టపడతాడు. తను కూడా కార్తిక్‌ని ఇష్టపడుతుంది. వీరిద్దరి సంగతి అంజలి ఇంట్లో తెలిసిపోతుంది. పద్నాలుగేళ్ల వయసులో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మందలిస్తారు. అంజలికి తీసుకుని ముంబై వెళ్లిపోతారు. అలా ఓసారి విడిపోయిన వీరిద్దర్ని విధి పన్నేండేళ్ల తరవాత మళ్లీ కలుపుతుంది. కానీ రెండోసారీ విడిపోతారు. అంజలికి పెళ్లి కుదురుతుంది. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి అమెరికా నుంచి తిరిగివస్తుంది. ఈసారైనా కార్తిక్, అంజలి కలిశారా, లేదంటే మళ్లీ విడిపోయారా? – అనేదే మళ్లీ రావా… కథ.
విశ్లేషణ
రెండు ముక్కల్లో, నాలుగు లైన్లలో ‘మళ్లీ రావా’ కథని ఇంత సింపుల్‌గా తేల్చేశాం గానీ, దర్శకుడు మాత్రం ఈ కథని చాలా కాంప్లికేటెటడ్ గా డీల్ చేశాడు. ఇది మూడు దశల్లో నడిచే కథ. కార్తిక్ స్కూల్ డేస్, ఉద్యోగం చేస్తున్న రోజులు, అంజలిని మర్చిపోలేని సతమతమవుతున్న సమయం… ఈ మూడు దశల్నీ స్క్రీన్ ప్లేలో పేర్చి చూపించాడు దర్శకుడు. స్కూల్ కథ చెబుతున్నప్పుడు సడగ్‌గా ప్రస్తుతానికి వస్తాడు. మళ్లీ మధ్యలోకి వెళ్లాడు. మళ్లీ స్కూల్ డేస్. అలా ముక్కలు ముక్కలుగా కథ చెప్పడం బాగానే ఉన్నా – ఓ కథకు కనెక్ట్ అవుతున్న సమయంలో కథ సడన్‌గా ఫ్లాష్ బ్యాక్‌కో, ప్రస్తుతానికో వచ్చేయడం ఇబ్బంది కలిగించే విషయం. దాంతో మూడు దశల్లో ఎక్కడా మనసు ఓ చోట కుదురుగా నిలవదు. ఓ కథపై లగ్నం అవ్వదు. నిజానికి ఇలా మార్చి మార్చి కథ చెప్పడం చాలా కష్టం. స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేసే తెలివి తేటలు ఉండాలి. దర్శకుడికి అవి ఉన్నాయి కూడా. కాకపోతే ప్రేక్షకుల్ని కన్‌ప్యూజ్ చేయడం ఎందుకు?? ముందే చెప్పినట్టు కవిత్వం అర్థమైతే సరే సరి. లేకపోతే… ఎందుకొచ్చిన పైత్యం అనిపిస్తుంది. ‘మళ్లీ రావా’లో అటు కవితాత్మక ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు, పైత్యం గోల కూడా ఉంటుంది.
చెప్పదలచుకున్న పాయింట్ సూటిగా చేరుతుందో లేదో అనుకుని ప్రతీ విషయాన్నీ డిటైలింగ్‌గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. దాంతో అనవసరమైన సన్నివేశాలు కూడా విడమరచి చెప్పాల్సివచ్చింది. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాల్సిన చోట కూడా… సుదీర్ఘంగా సన్నివేశాల్ని నడిపించాడు. మధ్యమధ్యలో ఐటీ ఆఫీస్ చుట్టూ నడిచే కామెడీ.. సున్నితంగా పండబట్టి సరిపోయింది. లేకపోతే.. అలా నిదానంగా ఒకే చోట కూర్చుని టీవీ సీరియెల్ చూస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా చూడాల్సివచ్చేది. ఎమోషన్స్ బాగానే పండినా – మరీ లెంగ్తీగా సాగడం, కథానాయిక కార్తీక్‌తో పెళ్లికి ‘నో’ చెప్పడానికి ఎంచుకున్న కారణం కూడా ఫోర్డ్స్‌గా అనిపించడం, మళ్లీ కలుసుకోవడానికి కూడా సరైన రీజన్ లేకపోవడంతో ‘మళ్లీ రావా’ మళ్లీ మళ్లీ చూసే సినిమాలా మారలేకపోయింది. పతాక సన్నివేశాల్ని కూడా పొయిటిక్‌గా చెప్పడానికి ప్రయత్నించాడు. అది బాగానే ఉన్నా – ఓ వర్గానికి మాత్రం నచ్చుతుందన్న విషయం గమనించలేకపోయాడు దర్శకుడు. తొమ్మిదో తరగతి వయసులో ఓ జంట ప్రేమలో పడడం (దర్శకుడు అది ప్రేమ కాదు అని ఎంత కన్వెన్సింగ్ గా చెప్పడానికి ప్రయత్నించినా సరే).. ఇబ్బంది కలిగించే అంశమే. అందుకే ఆ చైల్డ్ ఎపిసోడ్ ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నా.. చైల్డిష్ నెస్ కనిపిస్తూనే ఉంటుంది.
నటీనటులు
సుమంత్ యాజ్ ఇట్ ఈజ్ గోదావరిలో తన పాత్రని గుర్తు చేసుకుని నటించేశాడు. తనకి కరెక్ట్‌గా ఇలాంటి పాత్రలే సూటవుతాయి. ఇలాంటి కథలే నప్పుతాయి. అందుకే తన పాత స్టైల్‌లోనే నడిపించేశాడు. ఆకాంక్ష సింగ్ చూడ్డానికి ఏదోలా ఉన్నా, నటన విషయంలో వంక పెట్టలేం. చిన్నప్పటి అంజలిగా కనిపించిన అమ్మాయి… ఆకట్టుకుంది. సుమంత్, అన్నపూర్ణమ్మ తప్ప మిగిలిన వాళ్లెవ్వరూ మనకు పరిచయం లేని మొహాలే. కాకపోతే వారి వారి పాత్రల్లో చక్కగా రాణించారు.
సాంకేతిక వర్గం
శ్రవణ్ సంగీతం వినసొంపుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. బాగుంది. పాటలు అందంగా, పొయెటిక్‌గా రాశాడు గీత రచయిత కె.కె. బడ్జెట్ పరిమితులు కనిపిస్తున్నాయి. కానీ.. ఇలాంటి కథని, ఇలా తీయడమే కరెక్ట్! దర్శకుడిలో విషయం ఉంది. సింపుల్ కథని, స్క్రీన్ ప్లేతో కాంప్లికేటెడ్‌గా మార్చుకుని మరీ, ఆ విభాగంలో తన ప్రతిభను చాటుకోవాలని చూశాడు. మాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. వీలు దొరికింది కదా అని మెలో డ్రామాతో వాయించకుండా, ఎంత రాయాలో అంతే రాశాడు.
తీర్పు
ముందే చెప్పినట్టు పొయెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అందరికీ ఎక్కకపోవొచ్చు. ఈ సినిమా కూడా అంతే! కాకపోతే స్లో ఫేజ్ అయినా సినిమా చూస్తాం, మాకు పోయెట్రీ అంటే ఇష్టం, థియేటర్లో ఎంత సేపైనా ఓపిగ్గా కూర్చుంటాం.. అనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా మళ్లీ రావా వెళ్లొచ్చు. అయితే వాళ్లకు కూడా ఇది మళ్లీ మళ్లీ చూసే సినిమా కాదు.
ఫైనల్ టచ్: ‘మళ్లీ రావా’.. మళ్లీ అంటే చాలా కష్టం!!
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5