మెగా కుటుంబానికి ‘గురువు’… ఒక విధంగా సత్యానంద్ అనుకోవాలి. పవన్ కల్యాణ్ నటనకు సంబంధించిన శిక్షణ ఆయన దగ్గరే తీసుకున్నాడు. అల్లు అర్జున్ కూడా అంతే. సాయిధరమ్, శిరీష్ కూడా అక్కడే పాఠాలు దిద్దుకున్నారు. ఇప్పుడు మెగా అల్లుడు కల్యాణ్ కూడా సత్యానంద్ దగ్గరే శిక్షణ తీసుకున్నాడు. నటన, డైలాగ్ మాడ్యులేషన్లో సత్యానంద్ శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లోనే డాన్స్ కోచింగ్ కూడా అయిపోయింది. ఓ ట్రైనర్ సహాయంతో గత ఆరు నెలలుగా శిక్షణ తీసుకుంటాడు కల్యాణ్. అవన్నీ ఓ కొలిక్కి రావడంతో మెగా అల్లుడి సినిమా ఇప్పుడు ఓకే అయిపోయింది. జవనరిలో ఈసినిమా పట్టాలెక్కబోతోందని టాక్.
కల్యాణ్ ఎప్పుడైతే మెగా అల్లుడు అయ్యాడో, అప్పుడే.. ‘హీరోగా అవుతాడు’ అనే వార్తలు బయటకు వచ్చాయి. అప్పుడు మెగా ఫ్యామిలీ బయటపడలేదు. ‘అవును’, ‘కాదు’ ఏదీ చెప్పలేదు. సైలెంట్ గా సత్యానంద్ దగ్గరకు పంపి, తర్ఫీదు ఇప్పించేశారు. ‘మీ అబ్బాయిని హీరోగా చేస్తాం’ అని మాట పెళ్లి సమయంలోనే వియ్యంకుల వారికి ఇచ్చేశాడట చిరంజీవి. దాన్ని మర్చిపోకుండా ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు చిరు. ప్రొడక్షన్ అంతా సాయి కొర్రపాటి చూసుకున్నా, చరణ్ తనవైన సూచనలతో ఈ టీమ్‌ని ముందుకు నడిపిస్తాడని తెలుస్తోంది. తొలి సినిమాకే మరీ ఎక్కువ హైప్ తీసుకురాకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ని బయటి నిర్మాతలతో సెట్ చేశారని, ఒకవేళ తొలి సినిమా క్లిక్కయ్యి, కల్యాణ్ సినిమాలకు పనికొస్తాడు అనుకొంటే… రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.