తెలుగు చిత్రసీమ డబ్బింగ్ సినిమాలపై కొరడా ఝలిపించబోతోందా?? ప్రస్తుతం అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందా??? అవుననే అనిపిస్తోంది. రోబో 2.0 సినిమా విడుదల విషయంలో ఎదురైన పరిణామాలు, ఆ సినిమాని ఢీ కొట్టడానికి తెలుగు చిత్రసీమ చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే, తప్పకుండా ఏదో ఓ మార్పు ఉండబోతోందని అర్థమవుతోంది. పండగలు, ముఖ్యమైన సీజన్లలో డబ్బింగ్ సినిమాల్ని అడ్డుకొనేందుకు నిర్మాతల మండలి ఓ గట్టి కార్యాచరణ పథకం రచిస్తుందని టాక్. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయపై ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా పండగలు, ముఖ్యమైన సీజన్లలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఆడేలా, వాటికే థియేటర్లు దొరికేలా కఠినమైన నియమాలు రూపొందించే పనిలో ఉందని టాక్.
ఒకవేళ డబ్బింగ్ సినిమాలు వద్దామనుకున్నా, వాటికి తక్కువ థియేటర్లు ఇవ్వాలని, వంద థియేటర్లు మించకుండా చూసుకోవాలని నిబంధనలు మారుస్తారట. ద్విభాషా చిత్రంగా భ్రమింపజేసి చూడాలనుకున్న సినిమాల్నీ పసిగట్టి వాటిపైనా కొరడా ఝలిపించడానికి, డబ్బింగ్ సినిమాలపై ఎక్కువ పన్ను విధించేలా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి సమాయాత్తం అవుతున్నారని టాక్. ఇదంతా రోబో 2 కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 27న విడుదల కావాలని చూస్తున్న కొన్ని తెలుగు చిత్రాలకు రోబో 2 అడ్డు పడుతోంది. ఇప్పుడు దాన్ని తొలగించడానికి… నియమావళి కఠిన తరం చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ రూల్స్ మారితే.. తమిళ చిత్రసీమ ఊరుకుంటుందా? మన సినిమాల్ని వాళ్లూ అడ్డుకుంటారు కదా?? ఇలాంటి నియమాలు ఎక్కువయితే తెలుగు, తమిళ చిత్రసీమల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది. మరోవైపు తమిళ సినిమా హక్కుల కోసం ఎగబడడం కూడా కాస్త తగ్గుతుంది. మరి ఈ కొత్త నియమాలు ఎలా ఉంటాయో? ఏయే సినిమాలపై ఎఫెక్టు చూపుతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.