జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు పై అభిమానులు ఏమనుకుంటున్నారో ఏమో గాని పవన్ కళ్యాణ్ మాత్రం అనుమానం గానే ఉన్నారా? గత 4 రోజులుగా ఆయన ప్రసంగాల్లో పలు మార్లు ఆయన మాట్లాడిన మాటలు విన్న విశ్లేషకులు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాను అధికారంలోకి వస్తేనే చేస్తా అని చెప్పనని గెలవకపోయినా కొంత అయినా మార్పు తెస్తా అంటున్నారు పవన్. గత 4 రోజుల్లో పలు మార్లు ఇదే మాటను కాస్త అటూ ఇటుగా అంటూ వస్తున్నారు.
తాజాగా ఒంగోలులో కూడా ఆయన ఇదే మాట అన్నారు. శనివారం పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధితకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్స్ గ్రేషియా ఇవ్వడం కాదని అసలు అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రి అఖిల ప్రియ ఒంగోలు వచ్చి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని కోరారు.
అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ… పలు విషయాలు ప్రస్తావించారు. భావి తరాల కోసమే తాను జనం ముందుకు వచ్చా అన్నారు. అవకాశ వాద రాజకీయాలు తాను చేయబోను అన్నారు. అదే సందర్భంగా… తాను ఇప్పుడు పోరాటం చేస్తూన్నా . ఓడిపోవచ్చు కానీ దెబ్బ కొట్టే వెళ్తా అన్నారు.