ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకున్నా – ఓ సినిమాపై మరో సినిమా ‘పోటీ’కి సై అంటూనే ఉంది. రెండు సినిమాల మధ్య క్లాష్ రావడం, అందులోంచి ఓ సినిమా పక్కకు తప్పుకోవడం ఇప్పట్లో సర్వసాధారణమైన విషయమైపోయింది. అలాంటప్పుడు ఓ సినిమా పక్కకు తప్పుకోవడమో, లేదంటే తప్పని పరిస్థితుల్లో రెండూ సై అంటే సై అంటూ రంగంలోకి దిగిపోవడమో జరిగిపోతున్నాయి. రంగస్థలం, మహానటికి మధ్య అలాంటి క్లాషే ఏర్పడింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. అంతలోనే ‘రంగస్థలం’ డేట్ కూడా ఫిక్సయ్యింది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న రాబోతోంది. మహానటిపై అశ్వనీదత్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అల్లుడి హోదాలో నాగ్ అశ్విన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కాస్టింగ్ పరంగా, బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడని అశ్వనీదత్… రిలీజ్ డేట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మార్చి 29న వద్దామనుకున్నాడు. ఇంతలోనే రంగస్థలం రిలీజ్ డేట్ కూడా ఖరారైపోయింది. రెండు సినిమాలకూ తేడా ఒక్కరోజే. అయినా.. సరే – మహానటిలో అలజడి రేపుతోంది రంగస్థలం. రెండు సినిమాలకూ కావల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా సరే, రిస్క్ తీసుకోవడానికి అశ్వనీదత్ ఏమాత్రం సిద్ధంగా లేడని తెలుస్తోంది. అందుకే ఓ వారం ముందు గానీ, వెనక్కి గానీ తన సినిమాని తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. ఈ విషయంపై రంగస్థలం నిర్మాతలతో ఓసారి సంప్రదించి, ఆ తరవాత మహానటి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిద్దామని అశ్వనీదత్ భావిస్తున్నట్టు సమాచారం. సో… మహానటి రిలీజ్ డేట్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట.