రాజమౌళి మరో సంచలనానికి తెర తీశాడు. ఎన్టీఆర్ , రామ్ చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇప్పటికే స్ర్కిప్టు పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. 2018 జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలెట్టి మార్చి – ఏప్రిల్‌లలో లో రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారని సమాచారం. రంగస్థలం తరవాత చరణ్ ఖాళీ అవుతాడు. ఎన్టీఆర్ కాల్ఫీట్లు కావాలంటే మాత్రం మే, జూన్ వరకూ ఆగాల్సిందే. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల కోసం బాలీవుడ్ నుంచి కథానాయికల్ని రంగంలోకి దింపాలని చూస్తున్నార్ట. కనీసం ఓ కథానాయిక అయినా బాలీవుడ్ నుంచి రావడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్లని కూడా ఈ మల్టీస్టారర్‌కి ధీటుగానే ఎంచుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడట. పారితోషికాల రూపంలోనే దాదాపుగా రూ.75 కోట్లు కేటాయించారని, రూ.40 కోట్లలో మేకింగ్ పూర్తి చేస్తారని, ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.120 కోట్లు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. రాజమౌళి సినిమా, అందులోనూ మల్టీస్టారర్ అంటే రూ.120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది. ఈ సినిమా ద్వారా దాదాపుగా రూ.50 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ మిగల్చాలని రాజమౌళి భావిస్తున్నాడట.