నాలుగు రోజులు సాగిన పవన్ పర్యటన సాధించింది ఏమిటి? ఏ ఒక్క ప్రజా సమస్య అయినా పరిష్కారం అయిందా? కనీసం ఏ సమస్య పై అయినా అర్ధవంతమైన చర్చకు గాని, పరిష్కరించే ప్రయత్నాలకు గాని కారణం అయ్యిందా? అంటే సమాధానం ఏమొస్తుందో అందరికీ తెలిసిందే. కానీ ఈ స్టార్ హీరో పర్యటన కొన్ని మార్పు చేర్పులకు మాత్రం దోహదం చేసినట్టు పరిశీలకుల అంచనా. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలెలా ఉన్నా సోషల్ మీడియాలో పోరాట యోధులు మాత్రం కొత్త రూటు తీసుకునేందుకు కారణమైంది అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తన పర్యటనలో అధికార పార్టీ కన్నా ఎక్కువగా ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేయడం, అదీగాక ఈ సారి నేరుగా జగన్ పేరు ప్రస్తావించి మరీ విమర్శలు గుప్పించడం, దానికి థీటుగా విపక్ష పార్టీ స్పందించడం, జనసేనానిపై ఆఘమేఘాల మీద విరుచుకుపడడం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో పార్టీల మద్ధతు దారులు యూటర్న్ తీసుకున్నట్టు కనపడుతోంది. గత కొంతకాలంగా పీఆర్పీ మద్ధతు దారులు లేదా పవన్ అభిమానులు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు సాగిస్తూండేవారు. అలాగే భాజాపాను, ప్రధాని మోడీని కూడా తరచు విమర్శించేవారు. ఈ విమర్శల్లో వైసీపి నుంచి ఒక్క రోజా మీద తప్ప మరెవరీని పెద్దగా లక్ష్యపెట్టేవారు కాదు.
అయితే పవన్ పర్యటన నేపధ్యంలో అకస్మాత్తుగా ఆయన ఫ్యాన్స్‌సైతం వైసీపీ పార్టీ మీద నిప్పులు చెరగడం ప్రారంభించారు. అచ్చం తమ నేత తరహాలోనే అధికార తెలుగుదేశం పార్టీని వదిలేసి జగన్, ఆయన మద్ధతుదారలు అంందరిపై విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఇక తెలుగుదేశం ఫాలోయర్స్ ఎప్పటిలానే తమ జగన్ వ్యతిరేకతకు కట్టుబడ్డారు. మరోవైపు దీనికి తగ్గట్టుగానే వైసీపీ ఫ్యాన్స్ కూడా పవన్‌పై దూకుడు పెంచారు. ఇందులో మరింత విశేషం ఏమిటంటే… భాజాపా మద్ధతుదారులు సైతం పవన్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయి విమర్శలకు పూనుకోవడం.
ఈ నేపధ్యంలో కాస్త సోషల్ మీడియాను పరిశీలనగా చూసిన వారికి వైకాపా, భాజాపా ఒకవైపు, తేదేపా, జనసైన్యం మరోవైపు మొహరించడం చూస్తే అనిపించేది ఒక్కటే. ఎన్నికలకు ఇంకా ముందుగానే సోషల్ మీడియా పొత్తులు ఖరారు చేసేసినట్టుంది అని.