తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండగ.. ప్రపంచ తెలుగు మహా సభలు. దీని కోసం ఏకంగా రూ.150 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయించింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సభల్ని నిర్వహించాలని ప్రభుత్వం అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తోంది. కవి సమ్మేళనాలు, సాంస్ర్కృతిక కార్యక్రమాలు అంటూ హంగులు చేస్తోంది. తెలంగాణ కవుల్ని ప్రత్యేకంగా సన్మానించాలని భావిస్తోంది. అంతా ఓకే. కానీ ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమకు ఎలాంటి ఆహ్వానాలూ అందలేదు. తెలుగు భాషపై, సాహిత్యంపై పట్టున్న రచయితలు, నటీనటులు, దర్శకులు టాలీవుడ్లో ఉన్నారు. వాళ్లెవ్వరికీ ఇంత వరకూ ఆహ్వానాలు రాలేదు. ‘అందరూ ఆహ్వానితులే.. అన్నారు కాబట్టి ఆ లిస్టులో మేమూ ఉన్నామేమో’ అంటూ ఓ రచయిత తెలుగు 360తో చెప్పుకొచ్చారు.
”నేను ఆంధ్రావాడినో, తెలంగాణ వాడినో అర్థం కాక పిలవలేదేమో.. ఆహ్వానం అందుతుందేమో అని చూస్తున్నా. ఆహ్వానించినా సంతోషమే, పిలుపు రాకపోయినా సంతోషమే” అంటూ మరో రచయిత, నటుడు… చెప్పుకొచ్చాడు. కె.విశ్వనాథ్ నుంచి త్రివిక్రమ్ వరకూ పరుచూరి బ్రదర్స్ నుంచి తనికెళ్ల భరణి వరకూ తెలుగు భాష ఖ్యాతిని సినిమాల ద్వారా చాటిచెప్పిన రచయితలు, దర్శకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లనీ పిలిస్తే బాగుండేదేమో! అయితే తెలుగు మహా సభలకు సంబంధించిన ఓ పాటని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌తో రూపొందించారు. ఈ పాట కోసం ఏకంగా రూ.75 లక్షలు బడ్జెట్ కేటాయించార్ట. ఆ డబ్బుతో ఓ సినిమానే తీసేయొచ్చు. ఇప్పటికైనా తెలుగు చిత్రసీమలోని ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు అందిస్తుందేమో చూడాలి.