నిన్నా, మొన్నటి దాకా పోలవరం ప్రాజెక్ట్ ని 2018 సంవత్సరం చివర్లోగా పూర్తి చేసి తీరుతాం అన్న ఏపీ సీఎం చంద్రబాబు స్వరంలో ఇప్పుడా ధీమా కనపడడం లేదు. వారం వారం సమీక్షలో భాగంగా సోమవారం ప్రాజెక్టు ను సందర్శించారు బాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమ వంతుగా చేసిన వ్యయం కేంద్ర సాయం వగైరా వివరాలు ఏకరువు పెట్టారు.
జాతీయ హోదా ఇవ్వక ముందే ప్రాజెక్ట్ కోసం రూ.5,135 కోట్లు ఖర్చు చేశామని కేంద్రం రూ..4,327 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ వేశారని అది సమస్యలను పరిష్కరిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు పడినంత కష్టం ఏ ప్రొజెక్ర్ కు పడలేదన్నారు. ఇది తన కల, జీవితాశయం అన్నారు.
వైసీపీ నేతలకు ఏ పిల్లర్ ఎక్కడుందో తెలుసా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రొజెక్టుని అడ్డుకోవాలని చూస్తున్నవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రాజెక్ట్ విషయంలో పవన్ కు సరైన అవగాహన లేదన్నారు. గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు… ఆయన గతంలోలా గట్టిగా చెప్పకుండా… 2019 లోగా పూర్తి అయ్యేందుకు అవకాశాలు ఇంకా లేకపోలేదని మాత్రమే బదులివ్వడం గమనార్హం.