రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నెల 16న పార్టీ పగ్గాలు స్వీకరిస్తున్నారు. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధికారికంగా ప్రకటించింది. దీంతో గడచిన 19 ఏళ్లుగా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ, తన కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచాలు కాల్చాయి.
ఇదేదో అనూహ్య పరిణామం కానే కాదు. చాన్నాళ్లుగా అనుకుంటున్నదే, కొన్నేళ్లుగా వినిపిస్తున్నదే. రాహుల్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే మాట తరచూ వినిపిస్తూనే ఉంది. అయినాసరే, ఇన్నాళ్లపాటు పార్టీ బాధ్యతల్ని రాహుల్ ఎందుకు తీసుకోలేదు..? కావాలనుకుంటే ఆయన్ని కాదనేవారు కూడా పార్టీలో ఎవ్వరూ లేరు కదా. అలాంటప్పుడు, 2004 నుంచి ఇప్పటివరకూ ఎందుకు ఆగాల్సి వచ్చింది..? ఇన్నాళ్లు ఆగడం ద్వారా రాహుల్ గాంధీ సాధించింది ఏదైనా ఉందా.. అంటే, ఉందనే అభిప్రాయమే కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. రాహుల్ నాయకుడిగా చాలా ఎదిగారు, దేశవ్యాప్తంగా పర్యటించి పరిస్థితులను అర్థం చేసుకున్నారు.. ఇలాంటి రొటీన్ అభిప్రాయాలను కాసేపు పక్కన పెడదాం. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇన్నాళ్లు వేచి చూడటం ద్వారా ఒక రకమైన సింపథీని రాహుల్ ఇప్పుడు పొందే అవకాశం ఉందని చెప్పొచ్చు.
2004లో తొలిసారిగా పార్లమెంటు సభ్యుడు అయ్యారు రాహుల్. ప్రధాని అయ్యే అవకాశం కూడా అప్పుడే వచ్చింది. పార్టీ నేతలంతా అదే కోరుకున్నారు. కానీ, రాహుల్ కాదనుకున్నారు. దేశాన్ని చదవాలంటూ ప్రజల్లోకి బయలుదేరతా అన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పదేళ్లపాటు దేశాన్ని ఏలింది. మూడుసార్లు ఎంపీగా ఉన్న రాహుల్.. కనీసం మంత్రి పదవి కూడా ఆశించలేదు. పార్టీ అధినాయకత్వం ఇస్తామన్నా తీసుకోలేదు. ఆ తరువాత, పార్టీలో యూత్ వింగ్ తీసుకున్నారు. ఉపాధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు.. అధ్యక్షునిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
ఈ క్రమంలో రాహుల్ రాబోతున్న ఇమేజ్ ఏంటంటే… అంచెలంచెలుగా నాయకుడిగా ఎదిగారన్నది ఒకటైతే, 2004లో అవకాశమున్నా ప్రధాని పదవి కోరుకోలేదు, 2009లో కూడా పదవి ఆశించలేదు, కనీసం కేంద్రమంత్రి పదవి కూడా ఆయన కోరుకోలేదు కదా. ఈ క్రమాన్ని త్యాగం అని చెప్పుకునే అవకాశం ఉంది. ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నాననీ, పదవి కోసమైతే ఏనాడో ప్రధాని అయ్యుండేవాడనని ప్రచారం చేసుకునే ఛాన్స్ ఉంది. ఏదైతేనేం, వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో… రాజకీయానుభవం కోసం కొన్నాళ్లు పాటు దేశంలో తిరిగాననీ, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకున్నాకనే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నానని రాహుల్ హ్యాపీగా చెప్పుకోవచ్చు. వారసత్వ విమర్శలను ధీటుగానే ఎదుర్కోవచ్చు. మరి, పార్టీ కష్టకాలంలో ఉండగా రాహుల్ అధ్యక్షుడు అవుతున్నారు. మున్ముందు ఆయన ముఖతా పార్టీ ఎలా నడుస్తుందో వేచి చూడాలి.