ఈ జనవరి 1న విడుదలై, విజయపథంలో దూసుకెళుతున్న ‘నేను శైలజ’ రామ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ దక్కించుకుంది. కిశోర్ తిరుమలను దర్శకునిగా పరిచయం చేస్తూ, కృష్ణచైతన్య సమర్సణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సూపర్ హిట్ చిత్రం అనధికారిక కాపీని ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని, చూస్తున్నారు. ఇది రవికిశోర్ దృష్టికి రావడం, ఎవరైతే ఇలా డౌన్ లోడ్ చేస్తున్నారో వాళ్ల ఐపీ అడ్రస్ కనుక్కుని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రవికిశోర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 50 మంది ఐసీ అడ్రస్ లను కనుక్కున్నారు. ‘నేను శైలజ’ను డౌన్ లోడ్ చేసి, చూస్తన్నవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నామని రవికిశోర్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు సంబంధించిన ఈ యాభై మందిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నారు.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నియమించిన ప్రత్యేకమైన యాంటీ-వీడియో పైరసీ సెల్ పైరసీదారులను పట్టుకునేందుకు మరింత ముమ్మరంగా వ్యవహరిస్తోంది. ”ఇల్లీగల్ డౌన్ లోడర్స్ పై లీగల్ గా చర్య తీసుకోవడంతో పాటు.. మీడియా ద్వారా కూడా వారి గురించి వెలుగులోకి తెస్తాం” అని ‘స్రవంతి’ రవికిశోర్ తెలిపారు. మొత్తానికి పైరసీ రూపంలో తమ కష్టం వృథా కానివ్వకూడదని రవికిశోర్ బలంగానే నిర్ణయించుకున్నారు. సో.. పైరసీదారులూ.. తస్మాత్ జాగ్రత్త.