సుమంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం మళ్లీ రావా. దర్శకుడి టేకింగు, విజువలైజేషనూ బాగానే ఉన్నా, సినిమా అంతా స్లో ఫేజ్లోనడిచింది. దానికి తోడు థియేటర్లో జనాలే లేరు. దాంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ ల జాబితాలో చేరిపోతుందేమో అనుకున్నారంతా. నిర్మాతకు నష్టాలు తప్పవని లెక్కలేశారు. అయితే ఇప్పుడు వాళ్లంతా తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సినిమా ని చాలా తక్కువ బడ్జెట్లోతెరకెక్కించారు నిర్మాతలు. మేకింగ్ కి కేవలం కోటి రూపాయలు అయ్యాయట. 30 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేయడం లాభించిన విషయం. థియేటర్లో జనాలు లేకపోయినంత మాత్రాన ఇదేం చెత్త సినిమా కాదు. టీవీల్లో వేస్తే.. బ్రహ్మాండంగా ఆడుతుంది. అందుకే శాటిలైట్ ఈ సినిమాకి కల్పతరువుగా కనిపిస్తోంది. కనీసం కోటి రూపాయలైనా శాటిలైట్ రూపంలో వస్తాయన్నది చిత్రబృందం ఆశ. మేకింగ్ అంతా శాటిలైట్‌తో రాబట్టుకోవచ్చన్నమాట. మల్టీప్లెక్స్‌లో టికెట్లు బాగానే తెగుతున్నాయి. ఈ వీకెండ్ ఎలాగైనా సరే, జనాలకు థియేటర్లకు రప్పించాలన్న ఉద్దేశంతో ప్రమోషన్లని స్పీడప్ చేసింది చిత్రబృందం.
అందుకుగానూ రానా కూడా రంగంలోకి దిగాడు. రానా – సుమంత్‌ల వీడియో ఇంటర్వ్యూని ప్రచారాస్త్రాలుగా వాడుకొంటోంది చిత్రబృందం. ఇదో క్లాస్ సినిమా అంటూ ముద్ర వేసి మల్టీప్లెక్స్ వరకూ డోకా లేకుండా చూసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈవారం వచ్చేవన్నీ చిన్న సినిమాలే. కాబట్టి.. ఇప్పటికీ మళ్లీ రావాకి ఆప్షన్లున్నాయి. సో… ఎటు నుంచి చూసినా నిర్మాతలు గట్టెక్కేసినట్టే. సుమంత్‌తో సినిమా తీసి, పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకొన్నారంటే నిర్మాతలు అదృష్టవంతులనుకోవాల్సిందే.