సన్నాఫ్ సత్యమూర్తి నుండి త్రివిక్రమ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ సినిమాకి తన దర్శకత్వం విభాగం మొత్తం మార్చేశారు. అప్పటి వరకూ ఒకే టీం కొనసాగించారు. రానురాను ఆ టీం త్రివిక్రమ్ మీదే పూర్తిగా ఆదారపడిపోయింది. ఆయనకు సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ఎక్కడో ఇబ్బంది. ఆయన ”ఏది చెప్పినా అదే సూపర్” అన్నట్టుగా నడిచింది. ఈ వ్యవహారం త్రివిక్రమ్ కే బోర్ కొట్టేసింది. ”ఇలా అయితే కొత్త యాంగిల్ ఎక్కడ వస్తుందని” భావించి సన్నాఫ్ సత్యమూర్తి కి చాలా వరకు తన డిపార్ట్ మెంట్ ని మార్చారు. ఇక’ అ ఆ’ సినిమాలో కూడా అదే జరిగింది.ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా పక్కన పెట్టారు.
మణిరత్నం కు రెహ్మాన్ లా.. త్రివిక్రమ్ కి దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత విద్వాంసుడిగా కొనసాగాడు. త్రివిక్రమ్ దేవిశ్రీది లది సూపర్ హిట్ కాంబినేషనే. ఈజీగా జనాల్లోకి వెళిపోయే పాటలు అందించాడు దేవిశ్రీ. ఇది ఎంతలా పాపులర్ అయ్యిందంటే.. త్రివిక్రమ్- దేవిశ్రీ పాటలు అంటే ‘ఇలా వుంటాయి” అని సాధారణ ప్రేక్షకుడు కూడా ఒక అంచనాకి వచ్చేసే పరిస్థితి. ఇక్కడే త్రివిక్రమ్ మళ్ళీ మార్పుపును కోరుకున్నారు. అ ఆ సినిమాకి కొత్త మ్యూజిక్ కోసం వెదికారు. అనిరుద్ అనుకున్నారు. కుదరలేదు. మిక్కి జే మేయర్ తో చేయించారు. త్రివిక్రమ్.. ఆల్బమ్స్ లో ‘అ ఆ’ కొంచెం డిఫరెంట్ గా ఉటుందనే చెప్పాలి.
ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ సినిమాకి అనిరుద్ మ్యూజిక్. ఇప్పటికే ఒక పాట ‘బయటికి వచ్చి’ బాగానే హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు ‘గాలి వాలుగా’ అనే పాటను విడుదల అయ్యింది. ట్యూను కొత్తగా ఉంటే.. దానికి తగ్గట్టు సీతారామశాస్త్రి కలం పరుగులు పెట్టింది. ‘కొర కొర కోపమేలా.. మనోహరి మాడిపోతానే’ అంటూ అందంగా తిట్టుకుంటూ సాగిన పాట ఇది. పిశాచీ, ఊర్వశీ, ప్రేయసీ.. అంటూ ప్రేమికురాలిగా అందంగా తిట్టుకొంటూ, కీర్తిస్తూ సాగిన పాట. ఈ రెండు పాటలు ఎలా వున్నాయి అనే మాట పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఈ రెండు ట్యూన్స్ చాలా కొత్తవి. పవన్ సినిమా అనగానే ఒక రేంజ్ లో కార్డ్లు సెట్ చేసి ఆర్కెస్ట్రా వాయిస్తుంటారు. కానీ ఈ రెండు పాటలు మాత్రం చాలా చాలా డిఫరెంట్. విడివిడిగా వినిపిస్తే.. అసలు ఇవి పవన్ కళ్యాణ్ సినిమా పాటలని చెప్పలేం. త్రివిక్రమ్ కి గిటార్ బీట్స్ ఇష్టం. ఈ రెండు పాటల్లో కూడా సాఫ్ట్, బేస్ గిటార్లు చాలా ఎక్కువగా వాడారు. చాలా క్లాసీగా వున్నాయి ట్యూన్స్. ఫ్రెష్ గా కూడా వున్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ రెండు పాటలు కూడా అనిరుద్ తో పాడించేశారు. ఆ వాయిస్ వింటే కొంచెం లేతగా అనిపిస్తుంది. బేసిగ్గా అయితే సింగర్ వాయిస్ మ్యాచ్ అయ్యేలా చూస్తుంటారు. కాని ఇక్కడ అది కనిపించడం లేదు. బహుశా.. ఇందులో కూడా కొత్తదనం కోరుకున్నారెమో.