కాపు రిజర్వేషన్లు పై మళ్లీ ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం పై మాట్లాడారు.
తాము ఇప్పటికే ఉన్న బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు నుంచి అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు. వారికి కేటాయించగా మిగిలిన దానిలో నుంచే అడుగుతున్నాం అన్నారు. కాకినాడలో మంగళవారం కాపు జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ… కేబినెట్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే కాపు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించినపుడే కాపులకు నిజమైన పండుగ అన్నారు. ఆ లెక్కన 10 నుంచి 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కాపు, బలిజ, ఒంటరి కులాలు ఏకతాటి పైకి రావాలని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
రిజర్వేషన్లు కల్పించినందుకు చంద్రబాబు కు కృతజ్ఞతలు అంటూనే… ఆయన ను ఇన్ని రోజులుగా తాము నమ్ముతున్నామని, ఆయన, తమను మోసం చేస్తే తామూ ఒక రోజున బాబును మోసం చేయాల్సి వస్తుందని, హెచ్చరించారు.