కొద్ది మాసాల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ సందర్శన అంటూ పర్యటించారు.సహజంగానే నీటిపారుదల శాఖమంత్రిగా హరీశ్ కూడా పాల్గొన్నారు.సభలో స్వాగత ప్రసంగం కూడా చేశారు.ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుంటే కెసిఆర్ ముఖ కవళికలు ఎలా వున్నాయో సోషల్ మీడియాలో చాలా సైట్లు ఫోటోలు పెట్టాయి. ఇటీవల మరోసారి కెసిఆర్ కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు సందర్శించారు. కొన్ని విమర్శలు కొన్ని సూచనలు చేశారు. ఆలస్యంపై ఆగ్రహం వెలిబుచ్చారు కూడా. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ మొత్తం పర్యటన ఫోటోలలో ఎక్కడా ఆయన హరీశ్‌తో కలసి నవ్వుతూ కనిపించలేదు.నమస్తే తెలంగాణ ప్రచురించిన ఫోటోలలో ఇతరులతో కలసి వున్నవాటిలో హుషారుగా నవ్వుతున్న కెసిఆర్ హరీశ్ వున్న వాటిలో మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు.ఆఖరుకు వాళ్లిద్దరే కలసి ఏవో మ్యాపులో పత్రాలో చూస్తున్న ఫోటో ప్రత్యేకంగా ప్రచురించారు గాని అందులోనూ అదే పరిస్థితి. తెలుగు మహాసభల సన్నాహక సమావేశాల్లో మాత్రం హరీశ్ వుంటున్నారు గాని ప్రాధాన్యత పరిమితంగానే లభిస్తున్నది. హరీశ్ అనుయాయులు సహాయకులు కూడా ఈ వాస్తవాలను అంగీకరించడం విశేషం. అయితే ప్రస్తుత పరిస్థితులలో సర్దుకుపోవడం తప్ప చేయగలిగింది లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అప్పుడప్పుడు హరీశ్‌ను మెచ్చుకున్న కెసిఆర్ ఇటీవల జిఇఎస్,మెట్రో ప్రారంభం వంటి సందర్భాల్లో విస్మరించారని, తాజాగా నీటిపారుదల విషయాలు ఆయనే ప్రత్యక్షంగా చూస్తుంటే మంత్రి పాత్ర ఏం కావాలని కూడా వారు వాపోతున్నారు. అయితే హరీశ్ మాత్రం వీటిపై ఏమాత్రం బయిటపడకుండా ప్రజలలో వుండి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. అదే తనకు నిజమైన రక్షణ అని కూడా ఆయన భావిస్తున్నారట.