చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా… రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా ఇతర పార్టీలకు వలస వెళ్లాక టీ టీడీపీపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. గతవారంలోనే ఆయన హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర నేతలతో పార్టీ భవిష్యత్తుపై సమీక్ష చేశారు. ఇకపై వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ నేతలతో మాట్లాడతానన్నారు. నెలకోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం పెట్టుకుందామన్నారు. అయితే, గతవారం జరిగిన ఆ సమావేశానికే ఉమా మాధవరెడ్డి గైర్హాజరు అయ్యారు. ఆమె పార్టీకి దూరం కాబోతున్నారన్న విషయం ఎప్పట్నుంచో వార్తల్లో ఉంది. ముందుగా, ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ, ఆ తరువాత ఆమె తెరాస వైపు మొగ్గు చూపారు. ఏదైతేనేం, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో బలమైన నాయకురాలు దూరమైనట్టే లెక్క.
మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డిలు ఈ నెల 14న తెరాస తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదే విషయమై చర్చించేందుకు మంగళవారం నాడు ప్రగతీ భవన్ కు వచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. వీరి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కేసీఆర్ బలమైన హామీలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమా మాధవరెడ్డి సొంత నియోజక వర్గమైన భువనగిరిలో ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి, తనకు రాజ్యసభ సీటు కావాలంటూ ఉమా మాధవరెడ్డి కోరినట్టు సమాచారం. రాజ్యసభ సీటు, లేదా తత్సమాన పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ విషయంలో కూడా స్పష్టమైన హామీ లభించిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ కి తెరాస పార్టీ కార్యవర్గంలో స్థానం కల్పిస్తారనీ, ఆ తరువాత ఎన్నికల సమయంలో ఏ నియోజక వర్గం నుంచి టిక్కెట్ ఇచ్చేదీ నిర్ణయం తీసుకుంటారట. సో.. ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా హామీలు లభించాయి కాబట్టి, ఇతర నేతలతో కలిసి తెరాసలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పొచ్చు.
దీంతో భువనగిరిలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు చెప్పుకోవచ్చు. తెలంగాణలో టీడీపీ ఉనికి బలంగా ఉండే ప్రాంతమది. ఉమా మాధవరెడ్డితోపాటు ప్రముఖ నేతలంతా తెరాస వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట! సో.. అక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున కేడర్ కూడా దూరమౌతున్నట్టే. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తమ వెంట ఉన్నారనీ, నాయకులన్ని వారే తయారు చేసుకుంటారని ఆ మధ్య చంద్రబాబు చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నాయకులతోపాటు ద్వితీయ శ్రేణి నేతలూ, కార్యకర్తలూ పెద్ద ఎత్తున పార్టీకి దూరమౌతుంటే పరిస్థితి ఏంటి..? ఇప్పటికే 13 మంది శాసన సభ్యులు టీడీపీకి దూరమయ్యారు. పేరున్న సీనియర్ నేతలు కూడా గులాబీ గూటికి చేరిపోయారు. నాయకులతోపాటు కేడర్ కూడా దూరమౌతుంది కదా! ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారనేది వేచి చూడాలి. వారానికోసారి వీసీలు అంటున్నారు, నెలకోసారి సమావేశాలు అంటున్నారు… ఇవన్నీ దూరమౌతున్న కేడర్ ను తిరిగి రప్పించగలవా..?