తిరుమల వెళ్లాలంటే ఏం చేస్తారు? బస్సో, రైలో, విమానమో ఎక్కి దర్శనం చేసుకొస్తారు. మరీ భక్తి ఎక్కువైతే కాలినడకన వెళ్తారు. తిరుమల అనే కాదు, ఏ పుణ్య క్షేత్రానికైనా అంతే! కానీ రెబల్ స్టార్ కృష్ణం రాజు తీరే వేరు. ఆయన ఒకే రోజు తిరుమల, షిరిడి, శబరిమల, వీలైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాలకు కూడా వెళ్లొచ్చేస్తారట. అది కూడా ఫ్రీగా. అదెలా సాధ్యం అంటారా?? అక్కడే ఉంది.. రెబల్ స్టార్వెరైటీ భక్తి. ఆయన మనసులో ఓ దండం పెట్టుకుంటే తిరుమల వెళ్లొచ్చినంత ఆనందం పొందుతార్ట. ఒకేరోజు అందరి దేవుళ్లకీ దండం పెట్టుకుంటే అన్ని పుణ్యక్షేత్రాలకూ వెళ్లొచ్చేసినట్టే నట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ”ఇదంతా ధ్యాన మహిమ. ధ్యాన ప్రయాణంతో ఒళ్లంతా తేలికైన భావన కలుగుతుంది. మనసుని తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా రోజూ ఉచిత దర్శనాలు భలే చేసేస్తున్నారే… అని ఇంట్లోవాళ్లంతా సరదాగా అంటుంటారు” అని చెప్పుకొచ్చారు కృష్ణం రాజు.
జాతకాలు, వాస్తు వీటిపై రెబల్ స్టార్‌కి గట్టి నమ్మకం ఉంది. ఆయన పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వెండి తెరపై కేవలం కృష్ణం రాజు అని పడేది. ‘మా’లోనూ అలానే రిజిస్టర్ చేశారు. అయితే పేరు ముందున్న ‘వెంకట’ తొలగించడంతో ఆయనకు తొలి రోజుల్లో ఏమాత్రం కలసిరాలేదట. ఆ తరవాత కొన్నాళ్లకు ‘యువీ’ అనే చేర్చుకోవడంతో వరుసగా హిట్లు కొట్టార్ట. మరి ఈ భక్తి, విచిత్రమైన సెంటిమెంట్లు ప్రభాస్‌కి ఉన్నాయో లేదో? ప్రభాస్ చేతిలో ‘యువీ’ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఆ సంస్థకు అన్నీ విజయాలే. బహుశా.. అది కూడా సెంటిమెంట్ ప్రభావమే ఏమో.?!