తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణ నేతలతో సమావేశమై వివరంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో పార్టీని ఉపేక్షించే ప్రసక్తి లేదంటూ నెలకోసారి టెలికాన్ఫరెన్సుకోసం సమయం కేటాయించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఆ సందర్భంగానే చాలామంది ముఖ్యులు తమ పార్టీలోకి రావాలని కోరుతున్నట్టు కూడా తెలియజేయడం టిటిడిపి నేతలకు ఉత్సాహం కలిగించిందట. కాంగ్రెస్‌లో అవకాశాలు లేకపోవడం,బిజెపిలో చేరినా పెద్ద ప్రయోజనం లేకపోవదం ఇందుకు కారణమని చెప్పుకున్నారు. టిడిపి తరపున పోటీ చేస్తే కనీసం ప్రచారం ప్రతిష్ట మిగులుతాయని డబ్బున్న ఆసాములు కొందరు ఆలోచిస్తున్నారని సమావారం. అయితే మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఆ సమావేశానికి గైరు హాజరవడంతో టిఆర్ఎస్లో చేరతారన్న కథనాలు వచ్చాయి. తర్వాత కెసిఆర్‌ను కలిసి నిజంగానే చేరిక కార్యక్రమం ప్రకటించారు. గ్యాంగ్ స్టర్నయీమ్తో సంబంధాలున్నాయంటూ పాలక పక్షమే ప్రచారం చేస్తే ఉమా మాధవరెడ్డి అందరికన్నా ముందు తీవ్రంగా ఖండించారు. రేవంత్ పార్టీ మార్పు తర్వాత కూడా టిడిపి వేదికలపై కనిపిస్తూనే వచ్చారు. మరి ఒకవైపున చంద్రబాబు తమ పార్టీలోకి ఇతరులు వస్తారని చెబుతుంటే ఇంత ముఖ్యమైన నాయకురాలు నిష్క్రమించడం టిటిడిపి వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. నయీం కేసు సందర్భంగా జరిగిన ప్రచారాలకు కారణమేమిటి? అవే ఆమెను అటువైపు నడిపించాయా? లేక తమ నేతలెవరిపైనా చర్య తీసుకోని కెసిఆర్ ప్రభుత్వ వైఖరి చూశాక తను కూడా అక్కడ చేరడం మంచిదని ఆమె అనుకున్నారా? రాజకీయవర్గాలు లేవనెత్తుతున్న ప్రశ్నలివి.రేవంత్ రెడ్డి రాజీనామా ఒక కొలిక్కి రాకపోవడంతో పాటు ఈ ఫిరాయింపులు కొనసాగడం వల్ల టిఆర్ఎస్ దూకుడు పెరుగుతుందనే వారు అంచనా వేస్తున్నారు.