ఇటీవలి కాలంలో తెలుగు చానళ్లపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయనిపిస్తుంది. యూ ట్యూబ్‌లో క్లిక్‌లు భారీగా వుండటంతో పాటు సోషల్ మీడియాలో ఈ ప్రభావం ఎక్కువగా వుండటం నేతలను ఆందోళనకు గురి చేస్తున్నది. తమకు వ్యతిరేకమైన కథనాలు వస్తే బాధపడటం ఒకటైతే అనుకూల కథనాలు రాలేదని వెంటపడటం కూడా పెరిగింది. మరోవైపున కొన్ని ఛానళ్లు పత్రికలు రాజును మించిన రాజభక్తితో ముందస్తు కథనాలు వెలువరించి ఆయా పార్టీలనూ ప్రభుత్వాలనూ కాపాడుతున్నాయనే విమర్శలు పెరిగాయి. కొమ్ములు తిరిగిన పాత్రికేయులుకూడా కనీస స్వేచ్చ కోల్పోతున్నామని వాపోతున్న పరిస్థితి ఏర్పడింది. నిరుత్సాహం పెరుగుతున్నది. బిజెపికి సంబంధించిన జాతీయ నాయకులు కూడా ఈ పరిణామంలో పాలు పంచుకుంటున్నట్టు సమాచారం. వైసీపీ పెద్దగా ప్రభావితం చేయగల పరిస్థితి లేదు గాని కాంగ్రెస్ నేతలలో ఎవరికి ఎంత ప్రచారం అనే అంతర్గత వైరుధ్యాలు వేధిస్తున్నాయి.ఈ విషయంలో యాజమాన్యాల రాజకీయాలతో నిమిత్తం లేకుండా వ్యాపార వ్యూహాలు నడుస్తున్నాయి. గతంలో వలె బ్యూరో చీప్‌లు ఎడిటర్ల పాత్ర తగ్గిపోయి నేరుగా యజమానులకే ఫోన్లు పోతున్నాయట. ర్యాంకులతో నిమిత్తం లేకుండా అన్ని సంస్థలకూ ఎదురవుతున్న సమస్య ఇదే.ఈ బాధలు లేకుండా సినిమా తారల గురించి ఆత్మహత్యల వంటి వాటి గురించి లేదంటే పవన్ కళ్యాణ్‌లా సినిమా రాజకీయాలు కలబోసిన విషయాల గురించి ఇస్తే రేటింగులైనా పెరుగుతాయని ఛానళ్లు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది.