ఆర్.నారాయణ మూర్తి. అజాత శత్రువు ఆయన. మూర్తి గారంటే అందరికీ గౌరవం. తాను నమ్మిన సిద్దాంతాల కోసం సినిమాలు తీస్తుంటాడు. ఎవ్వరినీ మోసం చేయడు. ఎవరి చేతిలో మోసపోడు. ఎవరి గురించైనా సరే – ముక్కుసూటిగా మాట్లాడతాడు. అవతల ఉన్నది మెగా స్టారా?? సూపర్ స్టారా?? అనే పట్టింపు ఉండదు. అందుకే నారాయణమూర్తి అంటే అంత ఇష్టం. కానీ ఈ మధ్య చిరంజీవి ని ఉద్దేశిస్తూ ఆయనో కామెంట్ చేశారు. నాన్ మెగా ఫ్యాన్స్ కి ఈ కామెంట్ భలే బాగా నచ్చేసింది. భలే పాయింట్ చెప్పావ్ మూర్తి.. అంటూ అభినందిస్తున్నారు.
ఇంతకీ నారాయణ మూర్తి ఏమన్నాడంటే..
ఎన్టీఆర్ జీవితంలో చెప్పుకోవడానికి కళా ఖండాలు చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు కూడా గొప్ప సినిమాలు చేశారు, కృష్ణ కెరీర్లో అల్లూరి సీతారామ రాజు ఉంది. కానీ గ్రేట్ మెగా స్టార్ కి చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు. ఆయన ఇంకా ముసలోడైపోతే ”అరె.. నేను ఇంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు.. అయితే ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవ్వాలి” అంటూ స్వయంగా చిరంజీవి ముందే… చెప్పేశాడు. చిరు ముందు ఇంత డేరింగ్‌గా డాషింగ్‌గా ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం నారాయణమూర్తికే చెల్లింది. నారాయణ మూర్తి కామెంట్లు విని చిరు నొచ్చుకోలేదు. నొచ్చుకున్నా, ఆ ఫీలింగ్ ఏమీ బయటపెట్టనివ్వలేదు. కాకపోతే ఒకటి… చిరు స్టామినా గురించి నారాయణ మూర్తికి తెలికయపోవడం ఒక్కటే మెగా ఫ్యాన్స్‌ని, సినీ అభిమానుల్ని బాధించే విషయం.
తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్లు రెండు కళ్లు. కాదనలేం. కానీ చిరంజీవి ఏమైనా తక్కువ తిన్నాడా? ఆ మాట కొస్తే… ఎన్టీఆర్ తరవాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ చిరంజీవినే కదా? చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఎంత మంది సినిమాల్లోకి వచ్చారు?? తెలుగు సినిమా కమర్షియల్ స్థాయి చిరుకి ముందు ఓ లెక్క, చిరు వచ్చాక ఒక లెక్క అనేది 30 సినిమాలు నిర్మాతగా తీసిన నారాయణ మూర్తికి తెలీదా?? గొప్ప సినిమా అంటే ఏమిటి?? అవార్డులు తెచ్చిన సినిమాలా, డబ్బులు తెచ్చిన సినిమాలా? అవార్డులే ప్రాతిపదిక అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలకు ఎన్నిసార్లు జాతీయ అవార్డులు వచ్చాయి?? ఇవన్నీ నారాయణమూర్తికి తెలియని విషయాలు కావు.
తెలుగు సినిమా వంద కోట్ల మైలు రాయి దాటింది.. ఆహా ఓహో అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ తెలుగు సినిమాల కమర్షియల్ పరిధిని సినిమా సినిమాకీ పెంచుకుంటూ వచ్చిందీ, వంద కోట్లకు పునాది వేసింది చిరంజీవి కదా?? ఘరానా మొగుడు వసూళ్లు చూసి… యావత్ భారత చలన చిత్రసీమ షేక్ అయిపోయింది. ఇప్పుడు బాహుబలి గురించి ఎలా మాట్లాడుకున్నారో, అప్పుడు ఘరానా మొగుడు గురించీ అలానే మాట్లాడుకున్నారు. ఇదంతా ఘనత కాదా??
చిరంజీవిని జనాలు అంటారు.. అనగలరు. ఎందుకంటే ఆయన మెతక. లోపల నొచ్చుకుంటాడే గానీ, తన భావాల్ని బయట పెట్టడు. ఇదే మాట ఏ బాలకృష్ణ ముందో అనమనండి చూద్దాం. అంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. చిరు మీద ఓ రాయి వేసినా, అది వెనక్కి రాదనేది చాలామంది ఉద్దేశం. అలాంటి గుంపులో నారాయణమూర్తి కూడా నిలబడిపోవడమే విచిత్రం!