హీరోల్ని చూపించడంలో త్రివిక్రమ్ శైలే వేరు! డైలాగులతో హీరోయిజం పండించడమే కాదు, లుక్ పరంగానూ కొత్తగా ఆవిష్కరిస్తాడు. అతడులో మహేష్ బాబు లుక్, అప్పటి వరకూ చూసిన లుక్స్ కంటే విభిన్నంగా సాగుతుంది. ‘జల్సా’లో పవన్ కల్యాణ్ కూడా అంతే. ‘అత్తారింటికి దారేది’లో నాజూగ్గా, అందంగా కనిపించాడు పవన్. ‘కాటమరాయుడు’లో మాత్రం వయసు కనిపించేసింది. లుక్ పరంగా పవన్ జాగ్రత్తలు తీసుకోకపోవడం పవన్ అభిమానులకు కూడా నచ్చలేదు. అందుకే `అజ్ఞాతవాసి’ విషయానికి వచ్చేసరికి త్రివిక్రమ్ మరింత జాగ్రత్త పడిపోయాడు. రాజకుమారుడి తరహా పాత్ర, పైగా విదేశాల నుంచి వచ్చినవాడు.. అందుకే కాస్ట్యూమ్స్, లుక్, స్టైల్.. ఈ విషయాల్లో త్రివిక్రముడు చాలా పర్టిక్యులర్‌గా వ్యవహరించాడు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన పవన్ లుక్స్ అన్నీ అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. తాజాగా మరోటి విడుదల చేశారు. పవన్ గిటారు వాయిస్తున్నట్టున్న ఈ స్టిల్.. పవన్ ఫ్యాన్స్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది. ఈ లుక్ లో మరింత కుర్రాడిలా మారిపోయాడు. ‘కాటమరాయుడు’లో చూసిన పవన్‌కీ, ఇప్పటి పవన్‌కీ చాలా తేడా కనిపిస్తోంది. స్టిల్స్‌లోనే ఇలా ఉంటే, సినిమాల్లో ఇంకెలా ఉంటాడో..??!