దర్శకధీరుడు రాజమౌళి ఆ మధ్య ఎన్టీఆర్- రామ్‌చరణ్ మధ్యలో తను కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసి సడెన్ గా టాలీవుడ్ లో హీట్ పెంచాడు. అయితే అది ప్రాజెక్ట్ కోసమా లేక క్యాజువల్ ఫోటోనా అని ఏ కాస్తో డౌట్ ఉన్న వాళ్ళ అనుమానాలు కూడా ఒక టివి ఛానెల్ ప్రోగ్రాం లో సాయి ధరం తేజ్ క్లియర్ చేసాడు – ఆ ఫోటో తెలుగు తెర పై రానున్న అతి పెద్ద మల్టీ స్టారర్ కోసం అని.
ఇక ఇటీవల రామ్‌చరణ్ ఇంట్లో జరిగిన ప్రి-క్రిస్మస్ వేడుకలకు ఎన్టీఆర్ తన కుటుంబంతో హజరయ్యారు. వారితో పాటు యువ కథానాయకుడు శర్వానంద్, ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. చెర్రీ భార్య ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్ చెట్టును తయారు చేశారు. ‘ఈ క్రిస్మస్ చెట్టును విస్తరాకులతో నేనే తయారు చేశా. మిస్టర్ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అంటూ ట్వీట్ చేశారు.
ఆ మధ్య జై లవ కుశ సక్సెస్ అయిన సందర్భం లో చరణ్, తారక్ కలిసి పార్టీ చేసుకున్న విషయం తెలిసిందే. వారు పార్టీ చేసుకుంటున్న ఫోటో ని కోన వెంకట్ ట్వీట్ చేయడం తో ఆ విషయం కాస్తా బయటికి పొక్కింది. ఇక ఈ ప్రి-క్రిస్మస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నా మరిన్ని ఫోటోలు ఇంకా బయటకి రావాల్సి ఉందని చెర్రీ-తారక్ సన్నిహితులంటున్నారు.